మద్యం సిండికేట్‌తో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఖ్య నేతల విలాసాలు, దర్జాలు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. ఏపీ ప్రజల రక్తం తాగి, లంచాల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను ప్రైవేట్ జెట్లలో తిరగడానికి, ఫైవ్ స్టార్ హోటళ్లు, పబ్బుల్లో అమ్మాయిలతో చిందులేయడానికి ఖర్చు చేయడమే కాకుండా..ఏకంగా ఆఫ్రికా దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 2న సిట్ అధికారులు అరెస్ట్ చేసిన కట్టా ప్రణోయ్ ప్రకాశ్ (A-52) మొబైల్ ఫోన్‌లో ఫోరెన్సిక్ నివేదికలో వైసీపీ ముఠా బాగోతం మొత్తం రికార్డయి కోర్టుకు చేరింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో అక్రమ సొమ్ము పంపిణీలో కీలక పాత్ర పోషించిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు 2025 జనవరిలో టాంజానియా పర్యటనకు వెళ్లారు. అక్కడ లంచాల సొమ్ముతో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటు చేయడానికి, జింబాబ్వే, జాంబియా లాంటి దేశాల్లో మైనింగ్ వ్యాపారాలు చేయడానికి ప్రణోయ్ ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించారు. టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ విమానాశ్రయం వద్ద చెవిరెడ్డి, ప్రణోయ్ ప్రకాశ్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఫోటోలు సిట్ చేతికి చిక్కాయి. ఇదే పర్యటనలో..ఎన్నికల్లో పంచిన లంచాల డబ్బు గురించి ఎక్కడా నోరు జారొద్దని ప్రణోయ్‌ను చెవిరెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.
2019కి ముందు అత్యంత సాధారణ జీవితం గడిపిన ఈ ముఠా సభ్యులు..మద్యం కుంభకోణం పుణ్యమా అని రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ప్రధాన నిందితులు రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య ఇతర సభ్యులతో కలిసి ఛార్టర్డ్ ఫ్లైట్లలో విలాసవంతంగా ప్రయాణించిన వీడియోలు సిట్ విశ్లేషణలో లభ్యమయ్యాయి. మరోవైపు రాజ్ కెసిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఖరీదైన పబ్బుల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, ఇసుక తిన్నెల్లో బగ్గీలు నడుపుతూ విహరించిన చిత్రాలు వీరు దోచుకున్న సొమ్ముతో చేసిన జల్సాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సైమన్ ప్రసన్న అనే మరో నిందితుడు బోటు నడుపుతూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా ఈ ఫోన్లలోనే బయటపడ్డాయి.
దొంగల మధ్య చెలరేగిన గొడవలు
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. అడ్డగోలుగా సంపాదించిన డబ్బులో వాటాల కోసం ఈ ముఠా సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. మద్యం కుంభకోణం సొమ్ములో నాకు 5 శాతం వాటా ఇవ్వాలి. లేదంటే నేను విజిల్ బ్లోయర్‌గా మారి నీతో పాటు ఐప్యాక్ ప్రతినిధి అనురాగ్ బండారం అంతా సిట్‌కు చెప్పేస్తా అంటూ ప్రణోయ్ ప్రకాశ్.. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరించిన వాట్సాప్ చాట్లు కలకలం రేపుతున్నాయి. దుర్భాషలు, బూతులతో సాగిన ఈ చాటింగ్‌లో..ఇప్పటివరకూ విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ కాలేదు, నేను అవుతా అని ప్రణోయ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత కుమ్ములాటలను, వారిలోని భయాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి వసూలు చేసిన నగదును దాచడానికి వైసీపీ ముఠా హైదరాబాద్, అమరావతిలో రహస్య డెన్‌లను ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ ఖాజాగూడలోని ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో 2021 జులై 12న తీసిన ఫోటోల్లో గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. బాలాజీ ఎంటర్‌ప్రైజెస్, ఎలైట్ వింటేజ్, నెక్టార్ బాట్లింగ్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి వసూలు చేసిన ఈ లంచాల సొమ్మును అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి, వాటిపై రూ.20.07 లక్షలు, రూ.4 లక్షలు, రూ.4.36 లక్షలు అని పేర్లు రాసి మరీ భద్రపరిచారు. తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపంలోని ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్‌లో కూడా ఇలాంటి డెన్‌నే నిర్వహించి, ఆ సొమ్మును ఎన్నికల సమయంలో ప్రణోయ్ ప్రకాశ్ ద్వారా చెవిరెడ్డి మనుషులకు చేరవేసినట్లు సిట్ ఆధారాలతో సహా న్యాయస్థానానికి సమర్పించింది. ఆ కట్టల కొద్దీ నోట్ల దస్త్రాలే ఇప్పుడు వైసీపీ మద్యం సామ్రాజ్య పతనానికి శాసనాలుగా మారుతున్నాయి.
