సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా ఖండించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త బొగ్గు గనులను సాధించడంలో నిర్లక్ష్యం వహించి, సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో పారదర్శకతను పెంచుతూ, కొత్త గనులను సాధిస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు జరిగాయని ఆధారాలుంటే బయటపెట్టాలని, కార్మికులు, అధికారుల నిజాయితీపై నిరాధార ఆరోపణలు చేయవద్దని సూచించారు.
ప్రస్తుతం సింగరేణిలో తొమ్మిది గనుల నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతోందని మంత్రి తెలిపారు. గత పదేళ్లలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సగటున 40 లక్షల టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు 2.5 కోట్ల టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేశామని, అందులో జీ-9 బొగ్గు 12 లక్షల టన్నులు మాత్రమేనని వివరించారు. ఈ పరిమాణంలో 5.2 లక్షల టన్నులు తెలంగాణ జెన్కో కేంద్రాలకే సరఫరా చేసినట్లు తెలిపారు.
బొగ్గు ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింత పెంచుతున్నాం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఏటా 1.4 కోట్ల టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసేలా ఇంధన ఒప్పందం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. భవిష్యత్తులో కొత్త గనుల ద్వారా ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాతో ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు సంస్థకు దక్కలేదని ఆరోపించారు. ఈ బ్లాకులు లభించి ఉంటే ఏటా కోటి టన్నుల నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉండేదన్నారు. గతంలో సుమారు 14 గనులు మూతపడటంతో 1.5 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కోల్పోయిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామని మంత్రి తెలిపారు. తాడిచెర్ల బ్లాక్-2కు మైనింగ్ అనుమతులు సాధించడంతోపాటు, వేలం ద్వారా మణుగూరు పీకే ఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కించుకున్నామని చెప్పారు. ఈ గనుల ద్వారా భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి రవాణా, తూకం, పంపిణీ వరకు సాంకేతిక నిఘా ఉంటుందని శ్రీధర్‌బాబు వివరించారు. ఎస్ఏపీ, ఈఆర్పీ వ్యవస్థలు, జీపీఎస్, జీపీఆర్ఎస్ వాహనాల పర్యవేక్షణ, జియో-ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ తూకం, ఆకస్మిక తనిఖీలు, విజిలెన్స్ బృందాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందన్నారు. ప్రతి టన్ను బొగ్గుకు లెక్క ఉంటుందని, చోరీ లేదా అక్రమాలు జరిగాయని ఆరోపించేవారు నిర్దిష్ట ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
కొందరు కాంట్రాక్టర్ల వల్ల నష్టం
టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను సమర్థించిన మంత్రి, పనులు చేపట్టే ప్రాంతాన్ని కాంట్రాక్టర్లు ముందుగానే పరిశీలించాలన్నదే దీని ఉద్దేశమని తెలిపారు. గతంలో పనిస్థలాలను పరిశీలించకుండా టెండర్లు వేసిన కొందరు కాంట్రాక్టర్లు, తర్వాత సమస్యలు ఎదుర్కోలేక పనులను మధ్యలోనే వదిలేశారని, దీంతో సంస్థకు నష్టం జరిగిందని చెప్పారు. జీఎండీసీ, జీఐపీసీఎల్, ఎన్ఎండీసీ వంటి సంస్థల్లోనూ ఇలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంపీడీఐ సలహా మేరకు 2018, 2021, 2023 సంవత్సరాల్లో సింగరేణి టెండర్లలోనూ సైట్ విజిట్ నిబంధన ఉందని గుర్తుచేశారు. గతంలో ఆమోదించిన నిబంధనను ఇప్పుడు తప్పుబట్టడం రాజకీయమేనని విమర్శించారు.
సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. సంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థల పేరుతో సింగరేణికి వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. టెండర్లలో కమీషన్ల సంస్కృతికి తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసి, పారదర్శకతను పెంచుతోందన్నారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతంలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయని, వాటిని సరిదిద్దేందుకు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గనుల భద్రత, పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యమిస్తూ బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని తెలిపారు. బొగ్గుతోపాటు కీలక ఖనిజాలు, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లోనూ సింగరేణి కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గతంలో గనులు కోల్పోయినవారు ఇప్పుడు ప్రైవేటీకరణ గురించి మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలకు బదులుగా గనుల కేటాయింపులు, ఉత్పత్తి గణాంకాలు, టెండర్ల విధానం, బకాయిల వివరాలపై ఆధారాలతో చర్చ జరగాలని సూచించారు.
