కోటి రూపాయల లంచం తీసుకున్న ఐఆర్ఎస్ అధికారిని గురువారంనాడు సీబీఐ అరెస్టు చేసింది. వివరాలలోకి వెళితే… 2017 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి హరీశ్ కుమార్ తన్వర్ చెన్నైలోని తీవ్రమైన ఆర్థిక మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ)లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
ఆయన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన ఆర్థిక మోసాల దర్యాప్తులో ఫిర్యాదుదారుకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది భరత్ శర్మ, ఆయన బంధువు ఆర్యన్ శర్మలను కూడా అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
సీబీఐ ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక కేసు నమోదు చేసిన అనంతరం నిందితులను పట్టుకునేందుకు వల పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం మొత్తంలో భాగంగా రూ.20 లక్షలను భరత్ శర్మ స్వీకరించినట్లు ఆరోపణలు రావడంతో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు డీటీ నెక్స్ట్ కథనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి హరీశ్ తన్వర్, న్యాయవాది భరత్ శర్మ నివాసాలు లేదా కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి, కేసుకు సంబంధించినట్లు భావిస్తున్న పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
డీహెచ్ఎఫ్ఎల్ ఆర్థిక వ్యవహారాలపై ఎస్ఎఫ్ఐఓ నిర్వహిస్తున్న దర్యాప్తులో ఇది జరిగింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎస్ఎఫ్ఐఓ సంక్లిష్టమైన సంస్థాగత ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేస్తుంది. అటువంటి దర్యాప్తులోనే ఒక అధికారిపై లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లంచం డిమాండ్, రూ.20 లక్షల చెల్లింపు, నిందితుల మధ్య సంబంధాలు, దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరించేందుకు జరిగినట్లు చెబుతున్న ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను సీబీఐ మరింతగా పరిశీలించాల్సి ఉంది.
