ఎంతకూ తన పోరాటం ఆపని ఇరాన్ తాజాగా అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన సంఘటన సంచలనం కలిగిస్తున్నది. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఒక సైనిక ఇంధన సరఫరా విమానం ఇరాక్‌లో కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
కూలిపోయిన విమానం అమెరికా వాయుసేనకు చెందిన కేసీ-135 రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ విమానం. ఈ విమానం ఇరాన్‌పై జరుగుతున్న ఆపరేషన్‌లో భాగంగా పనిచేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. విమానంలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో రెండు విమానాలు పాల్గొన్నాయి.
వాటిలో ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా మరో విమానం ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదానికి శత్రు దాడి లేదా మిత్ర దేశాల కాల్పులు కారణం కాదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. అయినప్పటికీ విమానం పూర్తిగా కోల్పోయినట్లు పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధికారులు పరిస్థితి అభివృద్ధి చెందుతున్నందున మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
సైనికుల కుటుంబాలకు స్పష్టమైన సమాచారం అందించేందుకు మరింత సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల నేపథ్యంలో ఇటీవల కాలంలో అమెరికా విమానాలకు వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత వారం అమెరికాకు చెందిన మూడు యుద్ధవిమానాలు పొరపాటున మిత్రదేశమైన కువైట్ సైనికుల కాల్పుల్లో కూలిపోయినట్లు వెల్లడైంది.
కొత్త లీడర్ భద్రతకు కూడా గ్యారెంటీ లేదు
ఇదిలా ఉండగా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై కొనసాగిస్తున్న సైనిక చర్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ యుద్ధ చర్యలు అంచనాలకు మించిన స్థాయిలో విజయవంతంగా సాగుతున్నాయని, ప్రస్తుతం ఇజ్రాయెల్ మరింత బలంగా నిలిచిందని ఆయన అన్నారు.
ఇరాన్‌కు తాజాగా ఎంపికైన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ భద్రతపై ప్రశ్నించగా నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర సంస్థల నాయకులకు ఎలాంటి జీవ భద్రత హామీ లేదని, అలాంటి నేతలపై జీవిత బీమా తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. హిజ్బుల్లా నాయకుడు నయీమ్ ఖాసెం విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని ఆయన సూచించారు.
మొత్తంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమాన ప్రమాదం, యుద్ధ సంబంధిత వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
