రాష్ట్రంలో వ్యాధుల నివారణ, నియంత్రణ దిశగా గేమ్ ఛేంజర్ కానున్న ‘సంజీవని’ పథకం ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మండలి సమావేశానికి హాజరైన రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులకు ‘సంజీవని’ పథకం గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారంనాడు వివరించారు. అనంతరం…పలువురు మంత్రులు ఈ పథకం గురించి వివరాలు తెలుసుకున్నారు.
వ్యాధులు సోకిన అనంతరం చికిత్సను అందించే సాంప్రదాయ విధానం నుండి(రియాక్టివ్) వ్యాధుల నివారణకు (ప్రివెంటివ్) దిశగా సమగ్ర మార్పునకు ‘సంజీవని” పథకం ఒక ‘గేమ్ ఛేంజర్’ కానున్నదని మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశంలో వివరించారు. డిజిటల్ వైద్య సేవలను అట్టడుగు స్థాయికి అందుబాటులోకి తెచ్చి వైద్య సేవల్ని పొందడంలో ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాన్ని తొలగించడానికి ‘సంజీవని’ ఇతోధికంగా ఉపకరిస్తుందని మంత్రి తెలిపారు. దార్శినికుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ‘సంజీవని’ పథకాన్ని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రజల ఆరోగ్య స్థితిని మదింపు చేయడానికి ‘సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్’ పథకం కింద ప్రజల ఇళ్ల వద్దనే ఒక్కొక్కరిపై 41 రకాల వైద్య పరీక్షలు చేయడడం జరురగుతుందని, ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యక్తి స్థాయిలోనూ, ఆయా ప్రాంతాలలో వ్యాధులు సోకే అవకాశాలను ముందుగానే పసిగట్టి తగు నివారణ చర్యల్ని చేపట్టేందుకు ‘సంజీవని’ దోహదం చేస్తుందని, దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకాన్ని చేపట్టినట్లు మంత్రి అన్నారు.
904 మొబైల్ మెడికల్ యూనిట్ల (104 వాహనాలు) ద్వారా ‘సిటిజన్ హెల్త్ స్క్రేనింగ్’ ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో వాహనం ద్వారా రోజుకు 20 మందికి ఒక్కొక్కరికి 41 రకాల వైద్య పరీక్షలు జరుగుతాయని, ఇందుకు సాలీనా రూ.163 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ పరీక్షల ఆధారంగా వ్యక్తుల డిజిటల్ హెల్త్ రికార్డులు తయారవుతాయని చెప్పారు.
డిజిటల్ నెర్వ్ సెంటర్ల ఏర్పాటు
ఈ పరీక్షల ఆధారంగా ‘డిజిటల్ నెర్వ్ సెంటర్ల’ ద్వారా ఆయా వ్యక్తులకు తగు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయబడతాయని, టెలీమెడిసిన్ సేవలు కూడా లభిస్తాయని, వైద్యులతో అప్పాయింట్‌మెంట్లు కూడా జరుగుతాయని, వ్యాధిగ్రస్తులైన వారు ఆసుపత్రులకు వెళ్లే అవసరాన్ని తగ్గించడం వీలవుతుందని, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా సంజీవని ద్వారా వైద్య సేవలను పొందవచ్చని మంత్రి వివరించారు.
గతేడాది జులై మాసంలో కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమై, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న ‘సంజీవని’ పథకాన్ని ఆగష్టు మాసంలో రాష్ట్రమంతటా విస్తరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రజలకు వైద్య సేవలను అందించే దిశగా పలు అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర మంత్రుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ దిశగా పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
డిజిటల్ వైద్య సేవలు, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60 శాతం గత రెండేళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 4.88 కోట్ల మందికి అభా అకౌంట్లు రూపొందించగా వీటిలో దాదాపు ఒక కోటి అకౌంట్లను గత రెండేళ్లలోనే ఏర్పాటు జరిగిందని మంత్రి తెలిపారు. వైద్య రంగంలో ఏఐ వినియోగానికి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి వెల్లడించారు.
ఆసుపత్రి ప్రసవాలలో పురోగతి
టెలీ వైద్య సేవలు, ఎన్సీడీ స్క్రీనింగ్ , ఎయిడ్స్ నియంత్రణ, ఎనీమియా నివారణ, ఆసుపత్రుల్లో ప్రసవాలు, క్షయ వ్యాధి నోటిఫికేషన్, ప్రసవకాలంలో మాతృ మరణాల నివారణ వంటి పలు అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ సోదాహరణంగా వివరించారు.
అయితే…మధుమేహం, అధిక రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధి బాధితులు జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నారని, ఈ దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర విభజనానంతరం, ఆహార పదార్థాలు, మందుల కల్తీ నివారణకు అవసరమైన యంత్రాంగంలో రాష్ట్రానికి భారీ లోటు సంక్రమించిందని, దీనిని పూరించడానికి గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశామని మంత్రి తెలిపారు. అవసరాల మేరకు తనిఖీ అధికారులు సేకరించిన నమూనాల పరిశీలనకు ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
మందుల నమూనా పరిశీలన సామర్ధ్యాన్ని సాలీనా 4,000 ( 2023 లో) నుంచి 13,000 కి పెంచామని, ఆహార పదార్ధాలు, తాగునీరు నమూనాల పరిశోధనా సామర్ధ్యాన్ని 2023లో ఉన్నదానికంటే 48,000 పెంచామని మంత్రి వెల్లడించారు.
డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా…ఆయుష్మాన్ యాప్, ఈ-సుష్రూత్ క్లినిక్, ఆరోగ్య సేతు-2.0 ఎన్‌హెచ్‌సిఎక్స్ మరియు బీమా పథకాలను ఆవిష్కరించారు.
