మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజా సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నప్పటికీ వాటికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, హైడ్రా చర్యలు, మైనింగ్ కుంభకోణాలు, భూ కుంభకోణాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు వంటి అనేక ప్రజా సమస్యలను హరీష్ రావు అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అంశాలపై సరైన సమాధానం ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు ప్రజల దృష్టి మరల్చేందుకు వ్యక్తిగత విమర్శలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. బుధవారం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరులో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కాముని ఉమేష్ చంద్ర, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
దేవాలయాలకు వెళ్లినా విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు
హరీష్ రావు దేవాలయాలను సందర్శించి దర్శనం చేసుకోవడాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి, తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజమైనవేనని, కానీ వాటి కోసం మత విశ్వాసాలను, దేవతలను ప్రస్తావిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించాలనే ఉద్దేశంతో దేవతలను అవమానించే విధంగా మాట్లాడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ విలువలకు విరుద్ధమని విమర్శించారు.
మహేష్ కుమార్ గౌడ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేవతలపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు వెలువడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఒకే విధంగా స్పందించాలని, మత విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని సూచించారు.
తెలంగాణలో కరువు నివారణ, సాగునీటి అవసరాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించడం కంటే ప్రస్తుతం రైతులకు అవసరమైన సాగునీటిని అందించే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల మత విశ్వాసాలను గౌరవించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని, భవిష్యత్తులో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కాముని శ్రీనివాస్, ములకల కనకరాజు, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, కాల్వ ఎల్లం, పొచబోయిన వైకుంఠం, ధర్మాజీపేట తిరుపతి రెడ్డి, సింగిరెడ్డి వినయ్ రెడ్డి, సామల మధు, ఏలేటి నర్సింహారెడ్డి, పంపరి కనకయ్య, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, మన్నే ఆనంద్, భాను తదితరులు పాల్గొన్నారు.
