కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలపై ఏకాభిప్రాయం లేదని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇదే విషయాన్ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కు సంబంధించిన అన్ని ఆదేశాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఆమోదంతోనే జారీ అయ్యాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మధ్య ఎస్‌ఐఆర్, ఫారం-6, ఎన్నికల సంఘం సాంకేతిక విభాగం పనితీరు తదితర అంశాలపై విభేదాలు ఉన్నాయంటూ ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ప్రకటన విడుదల చేసింది. పూర్తి ఎన్నికల సంఘం ఆమోదంతో విడుదల చేసిన ప్రకటనలో సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి పంపిన లేఖలు ఎన్నికల సంఘం విధానపరమైన నిర్ణయాలకు సంబంధించినవి కాదని, ఎన్నికల సంఘానికి డిప్యుటేషన్‌పై వచ్చిన ఒక అధికారి పనితీరుకు సంబంధించిన పరిపాలనా అంశాలేనని పేర్కొంది.
ఇటీవలి నెలల్లో ఎన్నికల సంఘం తీసుకున్న అనేక నిర్ణయాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ కూడా ఉందని పేర్కొంది. 2025 జూన్ 24న బిహార్‌తో ప్రారంభించి పశ్చిమ బెంగాల్‌తో పాటు మరో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్‌ఐఆర్ నిర్వహించేందుకు జారీ చేసిన ఆదేశాలు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే వెలువడ్డాయని తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2026 మే 27న సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో సమర్థించిందని ఎన్నికల సంఘం పేర్కొంది.
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌ను 2025 అక్టోబర్ 27న, మరో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన షెడ్యూల్‌ను 2026 మే 14న పూర్తి ఎన్నికల సంఘం ఏకగ్రీవ ఆమోదంతో జారీ చేసినట్లు తెలిపింది. మూడో దశలో మిగిలిన 12 రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తయిన తర్వాతే దేశవ్యాప్తంగా తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టత వస్తుందని పేర్కొంది.
ఫారం-6కు సంబంధించిన వివాదంపైనా ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఎస్‌ఐఆర్ కోసం ఫారం-6కు జత చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. సాధారణంగా ఎస్‌ఐఆర్ అమల్లో లేని కాలంలో 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం వర్తించే ఫారాలనే ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం సమావేశాల నిర్వహణ విధానంలోనూ మార్పులు తీసుకురానున్నట్లు తెలిపింది. ఇకపై ప్రతి సమావేశానికి సంబంధించిన ఎజెండాను ముందుగానే సభ్యులకు పంపిస్తామని, సమావేశం అనంతరం నిర్ణయాల మినిట్స్ జారీ చేస్తామని పేర్కొంది. ఎన్నికల కమిషనర్లు అధికారులకు ఇచ్చే అన్ని ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సంస్థాగత చర్చల్లో భిన్నాభిప్రాయాలు, సూచనలు ఉండటం సహజమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే తుది ఆదేశాలకు పూర్తి చట్టపరమైన ఆధారం ఉందని, అవి నిర్దేశిత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే జారీ అవుతున్నాయని స్పష్టం చేసింది. తాజాగా వెలువడిన ప్రకటనతో ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తన వైఖరిని మరోసారి స్పష్టంగా వెల్లడించినట్లయింది.
