దేశంలో ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్ తోనే జరగాలని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. తమ ఈ డిమాండ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు.
ఈ మూడు అంశాలపై కాంగ్రెస్ కార్యకర్తలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆందోళనలకు దిగుతున్నాయని ఖర్గే పేర్కొన్నారు. ఈ అంశాలపై వివిధ ప్రాంతాల్లో పోరాటం చేస్తున్న పౌర సమాజ ప్రతినిధులు, యువజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై విమర్శలను తీవ్రతరం చేసింది. ఎన్నికల కమిషన్‌లోని కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు, ఉత్తర్వులపై గత పది నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని, తమకు తెలియకుండా లేదా తమ సిఫార్సు లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది.
ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, ఏ సంస్థలోనైనా చర్చలు, నిర్ణయాల ప్రక్రియలో భిన్నాభిప్రాయాలు, పరిశీలనలు సహజమేనని పేర్కొంది. కమిషనర్ల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనంత మాత్రాన తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతపై ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన అన్ని ఉత్తర్వులకు పూర్తి చట్టపరమైన అనుమతి ఉందని, అవి నిర్దేశిత చట్టబద్ధ విధానాలకు అనుగుణంగానే జారీ అయ్యాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.
