నేరస్థులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, బాధితులకు పోలీసులంటే నమ్మకం ఏర్పడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలీసు విధుల్లో ధైర్యం ఎంత అవసరమో మానవత్వం కూడా అంతే అవసరమని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి సేవలను స్మరించుకోవడం కేవలం సానుభూతి మాత్రమే కాదని, అది సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.
1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని ఎదుర్కొంటూ పది మంది పోలీసులు వీరమరణం పొందారని చంద్రబాబు గుర్తుచేశారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మాతృభూమి రక్షణతో పాటు ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు వృత్తి ఎంతో గొప్పదని అన్నారు.
ఖాకీ అంటే బాధ్యతకు, పోలీసు అంటే భరోసాకు ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులే ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందిస్తారని చెప్పారు. ప్రమాదం జరిగినా, నేరం చోటుచేసుకున్నా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని అన్నారు. నిరంతరం విధుల్లో ఉంటూ ప్రజల భద్రత కోసం పనిచేసే విభాగం పోలీసు శాఖ మాత్రమేనని కొనియాడారు.
విజయవాడ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకమని చంద్రబాబు తెలిపారు. వీఐపీల భద్రత నుంచి సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసుల సేవలు ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాలతో పండుగలను జరుపుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటారని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో, నేరాలను ఛేదించడంలో రాష్ట్ర పోలీసులకు మంచి చరిత్ర ఉందని చెప్పారు. గతంలో ఫ్యాక్షన్ హింసను నియంత్రించడం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, మత ఘర్షణలను అరికట్టడం వంటి సందర్భాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు.
శాంతిభద్రతలు, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రజల సుఖసంతోషాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని చంద్రబాబు అన్నారు. భద్రతపై నమ్మకం ఉన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, తద్వారా పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. నిరంతరం అలజడి, అశాంతి, అభద్రత నెలకొన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రారని చెప్పారు. అందుకే తాను అధికారంలో ఉన్న ప్రతిసారీ శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ భద్రతకు విఘాతం కలిగించే కుట్రలను ఛేదించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చర్యలతో ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రతిష్ట మరింత పెరిగిందని అభినందించారు. దేశ భద్రత పరిరక్షణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసలు తెలిపారు.
పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తి తన సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని చంద్రబాబు అన్నారు. కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో పోలీసులను ఆశ్రయిస్తారని, వారి సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని సూచించారు. పోలీసు యూనిఫాం బాధితులకు అభయాన్ని కల్పించాలని, పోలీసులను ఆశ్రయించే ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాలని చెప్పారు. పోలీసులు తక్షణమే స్పందించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, కేసుల పరిష్కారంలో సమర్థత పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నేరాలు చేసే పద్ధతులు మారుతున్నాయని, వాటిని దర్యాప్తు చేసే విధానాలు కూడా కాలానుగుణంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒక్క ఫోన్ కాల్, ఒక లింక్, ఒక సందేశం ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు సైతం సైబర్ మోసాలకు బలవుతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని సూచించారు.
రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాలు నేరస్థులకు రక్షణ కల్పించే సాధనాలుగా మారకూడదన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రౌడీలు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. నేరం జరిగిన తర్వాత దానిని ఛేదించడం పోలీసుల సామర్థ్యానికి నిదర్శనమైతే, నేరం జరగకుండా ముందుగానే నివారించడం అత్యుత్తమ పోలీసింగ్‌కు గుర్తింపు అని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సీసీ కెమెరాలు నేరాలకు సంబంధించిన దృశ్యాలను అందిస్తే, డేటా విశ్లేషణ ద్వారా నేరాల వెనుక ఉన్న వాస్తవాలను గుర్తించవచ్చని వివరించారు. డ్రోన్ల ద్వారా పోలీసుల నిఘా పరిధిని విస్తరించవచ్చని, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణతో దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా అగ్రగామి గుర్తింపు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన దర్యాప్తు, నేరాల నివారణ, మానవీయ దృక్పథం కలగలిపి ప్రజలకు మెరుగైన భద్రత కల్పించాలని సూచించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేయాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు.
