అందరికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఒక సామెత ఉంది. సరిగ్గా ఇప్పుడు ఈ సామెత దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు సరిపోతుంది. రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ బీహార్ లో జన్ సురాజ్ పార్టీ ని స్థాపించిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రసాంత్ కిషోర్‌పై ఓటు వివాదం చెలరేగింది. బీహార్‌కి చెందిన ఆయన పేరు ఓటరు జాబితాలో రెండు రాష్ట్రాల్లో బీహార్ మరియు పశ్చిమ బెంగాల్‌లో నమోదు అయినట్లు వెలుగులోకి వచ్చింది. అధికారిక రికార్డుల ప్రకారం, కిషోర్ పేరు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా భవానీపూర్ నియోజకవర్గంలో 121, కాలీఘాట్ రోడ్ చిరునామా వద్ద నమోదు అయింది.
ఇదే చిరునామా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కూడా. ఆయన పోలింగ్ కేంద్రం సెయింట్ హెలెన్ పాఠశాలగా నమోదు అయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రసాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు.
మరోవైపు, ఆయన బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని కార్గహర్ అసెంబ్లీ విభాగంలో, ససారం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కూడా ఓటరుగా నమోదు అయ్యారు. అక్కడ ఆయన పోలింగ్ కేంద్రం మధ్య విద్యాలయ, కొనార్‌గా ఉంది. ఎన్నికల అధికారులు పేర్కొన్నట్లుగా ప్రజా ప్రతినిధుల చట్టం, 1950 లోని సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు నియోజకవర్గాల్లో ఓటరుగా ఉండకూడదు.
అది మా బాధ్యత కాదు: జన్ సురాజ్ పార్టీ
అలాగే, సెక్షన్ 18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో రెండుసార్లు పేరు ఉండడం కూడా నిషేధం. చిరునామా మారినప్పుడు ఫారమ్-8 నింపి పాత నియోజకవర్గం నుండి తన పేరును తొలగించమని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై స్పందించిన జన్ సురాజ్ పార్టీ జాతీయ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ మాట్లాడుతూ, ఇది ఎన్నికల సంఘం బాధ్యత అని అన్నారు.
“బీహార్‌లో ప్రత్యేకంగా ప్రారంభించిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్నో పేర్లు తొలగించారు. ఇంత ప్రసిద్ధుడైన వ్యక్తి విషయంలో కూడా పొరపాటు జరగడం ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది” అని వ్యాఖ్యానించారు. అయితే, కిషోర్ పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితా నుండి తన పేరు తొలగించమని దరఖాస్తు చేశారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వలేదు.
“ప్రసాంత్ కిషోర్ బాధ్యతలు తెలుసుకునే వ్యక్తి. అవసరమైతే ఎన్నికల సంఘం మమ్మల్ని సంప్రదించవచ్చు. మా న్యాయ బృందం తగిన సమాధానం ఇస్తుంది” అని తెలిపారు. ఈ వివాదంపై బీహార్‌లోని ఎన్డీఏ మరియు ఇండియా బ్లాక్ నాయకులు ఇద్దరూ స్పందించారు. జెడీయూ నాయకుడు నీరజ్ కుమార్ మాట్లాడుతూ, “బీహార్‌కు చెందిన కిషోర్ పశ్చిమ బెంగాల్‌లో ఓటరుగా నమోదు కావడం విచిత్రం.
ఓ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడానికి ఆ రాష్ట్ర ఓటరుగా ఉండాల్సిన అవసరం ఏముంది?” అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, “కిషోర్ మమతా బెనర్జీతో రాజ్యసభ సభ్యత్వం కోసం ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు. అందుకే పశ్చిమ బెంగాల్ ఓటరుగా నమోదు అయ్యారని అనుమానం.
కానీ మమతా ఆ ఒప్పందాన్ని తిరస్కరించడంతో, ఆయన కన్సల్టెన్సీ వ్యాపారాన్ని వదిలేశానని ప్రకటించారు” అని పేర్కొన్నారు. తదుపరి మమతా బెనర్జీ ఘన విజయం సాధించిన తర్వాత కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది నెలల తర్వాత ఆయన “బాత్ బీహార్ కి” పేరుతో ప్రచారం ప్రారంభించగా, మేధోసంపత్తి హక్కుల కేసు కారణంగా అది నిలిచిపోయింది.
బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కుట్ర
అనంతరం 2022లో 3,500 కి.మీ పాదయాత్ర చేపట్టి “జన్ సురాజ్” పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆపై పార్టీని స్థాపించారు. బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ ఈ వ్యవహారాన్ని “చిన్న పొరపాటు కాదు, పెద్ద నేరం” అని అభివర్ణించారు. “బీహార్ ఎన్నికలను దెబ్బతీయడానికి తృణమూల్ కాంగ్రెస్‌తో కిషోర్ కుట్ర చేస్తున్నారని అనుమానం” అని అన్నారు.
ఆయన ఎన్నికల సంఘం తక్షణమే కఠిన విచారణ చేపట్టాలని కోరారు. ఆర్ఎజేడీ ప్రతినిధి మృతుంజయ్ తివారి మాట్లాడుతూ, “ఈ ఘటన బీహార్‌లో జరిగిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పూర్తిగా ప్రహసనమని నిరూపిస్తోంది. ఎన్డీఏ నాయకుల్లో కూడా ఇలాంటి ద్వంద్వ నమోదులు ఉన్నాయని ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అదే జాబితాలో చేరారు” అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలో ద్వంద్వ నమోదులు సాధారణ సమస్యగా మారాయని అంగీకరించింది. అందుకే ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR) చేపట్టగా, సెప్టెంబర్ 30న ప్రచురించిన నవీకరించిన జాబితాలో 68.66 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. అందులో సుమారు 7 లక్షల మంది రెండు చోట్ల ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.
