ముఖ్యంశాలుహోమ్

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

#SoniaGandhi

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని “వక్రీకరించడానికి, అవమానించడానికి జరుగుతున్న ప్రయత్నాలు దేశపు పునాదులను దెబ్బతీయాలనే వ్యవస్థాత్మక యత్నం” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఢిల్లీలోని జవహర్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ప్రస్తుత పాలక పార్టీ అయిన బీజేపీ నెహ్రూ వారసత్వాన్ని అపఖ్యాతిపాలు చేస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. “ఇది కేవలం ఆయనను చరిత్రలో నుండి తొలగించే ప్రయత్నమే కాదు, భారతదేశం నిర్మించబడిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పునాదులనే ధ్వంసం చేయాలనే పెద్ద లక్ష్యంతో జరుగుతున్న కుట్ర” అని సోనియా గాంధీ అన్నారు. నెహ్రూ చేసిన సేవలపై విశ్లేషణకు కాంగ్రెస్ స్వాగతం పలుకుతుందనీ, కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిన పనులను వక్రీకరించడం, దురుద్దేశంతో అర్థం మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

నెహ్రూ వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చడం, స్వాతంత్ర్య సమరంలో ఆయన పాత్రను తగ్గించడం, భారతదేశాన్ని సరికొత్త సమస్యలతో ముందుకు నడిపిన తొలి దశలో ఆయన చేసిన కృషిని నీరుగార్చడం ఇవన్ని చరిత్రను తమ సౌకర్యానుసారం పునఃరచించడానికి చేసే ప్రయత్నాలేనని గాంధీ అన్నారు. ఈ చర్యల వెనుక ఉన్న సిద్ధాంత పాఠశాల స్వాతంత్ర్య సమరంలో ఏ పాత్రా పోషించలేదని, రాజ్యాంగ నిర్మాణానికి వ్యతిరేకంగా నిలిచిందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

“ఈ సిద్ధాంతం ద్వేషాన్ని రెచ్చగొట్టి మహాత్మా గాంధీ హత్యకు దారితీసింది. వారి హంతకులను మహిమాపరచడం ఇప్పటికీ కొనసాగుతోంది. సమాజంలో విభజన, పాక్షికతలను పెంచడమే వీరి దృక్పథం” అని ఆమె ఆరోపించారు. దేశాన్ని నిర్మించిన పునాది విలువలను రక్షించడానికి ప్రజలు ఒక్కటిగా నిలబడాల్సిన అవసరాన్ని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. “ఇది సులభమైన దారి కాదు. అయినప్పటికీ నెహ్రూ, ఆయన సహచరుల జ్ఞాపకార్థం మాత్రమే కాదు, మన భవిష్యత్తు తరాల కోసం కూడా ఈ ప్రయత్నాలకు ఎదురు నిలవాల్సిన అవసరం ఉంది” అని ఆమె తెలిపారు.

Related posts

డ్రోన్ దాడితో కువైట్ లో మంటలు

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

ఉన్మాద కామెంట్లు ఎందుకు? ఏమిటి ప్రయోజనం?

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

ఇక రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు

Satyam News

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

Satyam News

Leave a Comment