26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఈడీ ఎంటర్: లిక్కర్ కేసులో రూ.441.63 కోట్లు ఎటాచ్

#enforcement irectorate

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)–2002 కింద దర్యాప్తు చేపట్టి రూ.441.63 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులను అటాచ్ చేశారు.

ఈ ఆస్తులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలు, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి తదితరులకు చెందినవిగా ఈడీ గుర్తించింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు మరియు ఇతర స్థిరాస్తులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ కేసును ఈడీ తన దర్యాప్తును ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రారంభించింది. ఐపీసీ 120బి, 409, 420 సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.4000 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

ఈడీ దర్యాప్తు ప్రకారం 2019కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ వ్యాపారం పూర్తిగా పారదర్శకమైన ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడేది. కొనుగోలు, సరఫరా, అమ్మకాలు అన్నీ డిజిటల్ విధానంలో నమోదు అయ్యేవి.

అయితే 2019 ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతరం రిటైల్ లిక్కర్ దుకాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడం ప్రారంభించింది. అదే సమయంలో పాత ఆటోమేటెడ్ సిస్టమ్‌ను నిలిపివేసి మాన్యువల్ “ఆర్డర్స్ ఫర్ సప్లై” (OFS) విధానాన్ని అమలు చేశారని ఈడీ పేర్కొంది. దీని వల్ల అధికారులకు తప్పుడు ఆర్డర్లు పెట్టేందుకు అధిక స్వేచ్ఛాధికారాలు లభించాయని తెలిపింది.

ఈ మాన్యువల్ విధానాన్ని ఉపయోగించి కొన్ని ప్రముఖ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, ఎంపిక చేసిన బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగా కిక్‌బ్యాక్‌లు తీసుకున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా “సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్” (SSB) పేరుతో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి వాటి బేసిక్ ధరలను కృత్రిమంగా పెంచారని పేర్కొంది. దీంతో ఆ బ్రాండ్లు తయారు చేసిన డిస్టిలరీలకు భారీ లాభాలు వచ్చాయని, ఆ లాభాల్లో భాగం లంచాల రూపంలో పంపిణీ అయినట్లు తెలిపింది.

డిస్టిలరీలపై కూడా ఒత్తిడి తెచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ప్రతి కేసుకు 15 నుంచి 20 శాతం వరకు లంచం ఇవ్వాలని ఒత్తిడి చేసేవారని, లంచం ఇవ్వకపోతే చెల్లింపులు నిలిపివేయడం లేదా సరఫరా ఆర్డర్లను తిరస్కరించడం వంటి చర్యలు తీసుకునేవారని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించిన కమ్యూనికేషన్ సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా జరిగిందని తెలిపింది.

ఈ వ్యవహారంలో బూనేటి చాణక్య (అలియాస్ ప్రకాష్), ముప్పిడి అవినాష్ (అలియాస్ సుమీత్), మొహమ్మద్ సైఫ్ తదితరులు కీలక పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు కలిసి లిక్కర్ కొనుగోలు, సరఫరా వ్యవస్థను నియంత్రిస్తూ సుమారు రూ.3500 కోట్ల లిక్కర్ సిండికేట్ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది.

ఈ సిండికేట్ కొన్ని డిస్టిలరీలను నేరుగా లేదా పరోక్షంగా నియంత్రించినట్లు ఈడీ వెల్లడించింది. వాటిలో Adan Distillery Pvt Ltd, Leela Distilleries Pvt Ltd, U.V. Distilleries వంటి సంస్థలు ఉన్నాయని తెలిపింది. ఈ సంస్థలకు అసాధారణంగా అధిక వ్యాపార వాల్యూమ్ కేటాయించినట్లు పేర్కొంది.

లిక్కర్ రవాణా టెండర్ కూడా వివాదాస్పదంగా మారింది. ట్రాన్స్‌పోర్ట్ టెండర్‌ను Sigma Supply Chain Solutions Pvt Ltd కు ఇచ్చారని, కానీ ముందుకంటే అధిక రేట్లు నిర్ణయించారని ఈడీ తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఎస్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్ తదితరులు నియంత్రించినట్లు పేర్కొంది. ఆ తరువాత ఈ డబ్బును TEKKR, Arroyo, Ezyload వంటి సంస్థల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు వెల్లడించింది.

డిస్టిలరీలు ముడి సరుకులు, ప్యాకేజింగ్ కొనుగోళ్ల కోసం నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి ఫేక్ బిల్లులు సృష్టించినట్లు కూడా ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఆ విధంగా బ్యాంక్ డబ్బును నగదుగా మార్చుకున్నట్లు తెలిపింది. అనంతరం ఈ అక్రమ డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించింది. Eshanvi Infra Projects Pvt Ltd, ED Entertainment, Uni Corporate Solutions Pvt Ltd, Tag Developers వంటి సంస్థల ద్వారా భూములు కొనుగోలు చేసి హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపింది.

డబ్బును దాచేందుకు Owlook, Kripati, Nysna Multiventures, Arroyo, Ezyload, D-Cart వంటి షెల్ కంపెనీలను ఉపయోగించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల సుమారు రూ.100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు అంచనా వేసింది.

ఇప్పటివరకు ఈడీ గుర్తించిన మొత్తం మనీ ట్రైల్ రూ.1048.45 కోట్లుగా ఉంది. ఈ డబ్బును నగదు, బంగారం, డిస్టిలరీల నియంత్రణ రూపంలో తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ అక్రమ డబ్బుతో కొనుగోలు చేసిన భూములు, ఇతర ఆస్తులను కలిపి రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

Related posts

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య  విస్త‌ర‌ణ ప‌నులు

Satyam News

బంగారం నిల్వలను భారత్ అమ్మేసిందా…?

Satyam News

ధనవంతుడైన మామ హత్యకు కోడలు కుట్ర?

Satyam News

రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

Satyam News

ఐబొమ్మ రవికి బెయిల్: నెక్ట్స్ ఏంటీ?

Satyam News

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Satyam News

Leave a Comment