ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు పాల్గొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సదస్సులో మాట్లాడిన చంద్రబాబు నాయుడు భారత్ శరవేగంగా అభివృద్ధి, సాంకేతికత వైపు దూసుకెళ్తోందని అన్నారు.
మూడు దశాబ్దాల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక నిపుణులు వెళ్లారని చెప్పారు. ప్రస్తుతం నాలెడ్జ్ ఎకానమీలో భారత్ కీలక భాగస్వామిగా మారిందని, ప్రపంచంలోని గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లలో 60 శాతం భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. డిజిటల్ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.
అలాగే Google సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. అమరావతిని భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు కేంద్రం అమరావతి
అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసి క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందంజలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను తయారు చేసి ప్రపంచానికి అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఐటీ విప్లవం ప్రారంభమైనప్పుడు అనేక విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి ప్రధాన కేంద్రంగా మారిందని చంద్రబాబు గుర్తు చేశారు.
భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద గేమ్ చేంజర్‌గా మారబోతోందని, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌ను ఎలా వినియోగించుకుంటామన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. సైబరాబాద్‌తో పాటు అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నామని, టెక్నాలజీ, మౌలిక వసతులను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఐటీ సహా అనేక రంగాల్లో భారతీయులు గ్లోబల్ కమ్యూనిటీకి విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో భారతీయ నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాలకు వలస వెళ్లినప్పటికీ త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల కోసం భారీగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోందని, గ్రీన్ ఎనర్జీ కారిడార్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
గ్రీన్ అమ్మోనియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ
భవిష్యత్తులో భారత్ విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని, ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ అమోనియా ఉత్పత్తి కూడా ప్రారంభమైందని వెల్లడించారు. అలాగే జనాభా నిర్వహణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1 వరకు పెంచేలా పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందించామని చెప్పారు.
మూడో బిడ్డ పుట్టిన కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక సాయం, నెలకు రూ.1000 చొప్పున సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ వంటి ప్రోత్సాహకాలను కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఏరోస్పేస్ సిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
డ్రోన్ అంబులెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను కూడా త్వరలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు ఇచ్చే ఆలోచనలను అమలు చేసేందుకు భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు.
