మెదక్హోమ్

రేవంత్ రెడ్డి పాలనలో దిగజారిన శాంతిభద్రతలు

#RevanthReddy

ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. 2024 ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బయటపెట్టాయని అన్నారు.

దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం అత్యంత ఆందోళనకరమన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో గణనీయమైన శాతమని తెలిపారు. 2023తో పోలిస్తే సైబర్ నేరాలు దాదాపు 49 శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో ఒకటిగా మారిందన్నారు.

భయంకరంగా పెరిగిన మిస్సింగ్ కేసులు

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు కూడా భయానకంగా పెరిగాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో తెలంగాణలో 25,500 మంది మిస్సింగ్ కేసులు నమోదవగా, వారిలో వేలాదిమంది ఇప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు. ప్రతి రోజు సగటున ఆరుగురు చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు. చిన్నారులపై నేరాలు కూడా భారీగా పెరిగాయని తెలిపారు.

2024లో రాష్ట్రంలో చిన్నారులపై 6,767 కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్‌కు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 2022లో 22,066 కేసులు ఉండగా 2024లో అవి 24,495కు పెరిగాయని పేర్కొన్నారు.

మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు కావడం అత్యంత ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో మొత్తం కాగ్నిజబుల్ నేరాలు కూడా భారీగా పెరిగాయని తెలిపారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా, 2024 నాటికి అవి 2,17,976కు చేరుకున్నాయని అన్నారు.

దేశ సగటు కన్నా తెలంగాణలో నేరాలు ఎక్కువ

ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా, దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్ర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు పెరగడం, మహిళలు మరియు చిన్నారుల భద్రత క్షీణించడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. వేలాది సైబర్ నేరాల కేసులు, మిస్సింగ్ కేసులు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన కేసులను కూడా వేగంగా చేధించేవారని, కానీ ప్రస్తుతం కరీంనగర్‌లో జరిగిన పట్టపగలు నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. పట్టపగలు, ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఐపీఎస్ అధికారిణి భార్య హత్య వంటి ఘటనలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రలకు నిదర్శనం అన్నారు.

సీపీ సుమతి నిర్వహించిన ఆపరేషన్‌తో హైదరాబాద్‌లో మహిళల భద్రత ఎంత డొల్లగా మారిందో బయటపడిందన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షలు నిర్వహించడం మాత్రమే కాకుండా, క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్ రావు సూచించారు.

హోం మంత్రిగా రేవంత్ పూర్తిగా వైఫల్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం, రాజకీయ కక్షసాధింపు, మీడియా మేనేజ్‌మెంట్‌పైనే దృష్టి పెట్టి ప్రజల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, మహిళలు మరియు చిన్నారులకు మెరుగైన భద్రత కల్పించాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. ప్రజల భద్రతను రాజకీయ ప్రచారం కోసం బలి చేయొద్దని హరీశ్ రావు హెచ్చరించారు.

Related posts

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News

జగన్ ని హిందువుగా మార్చగలవా భూమన….???

Satyam News

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News

డ్రగ్ మాఫియా కింగ్ కాల్చివేత

Satyam News

దర్శకుడు పిసి ఆదిత్య కు దాసరి నారాయణరావు స్మారక పురస్కారం

Satyam News

ఢిల్లీ ‘యశోభూమి’లో ఏపీ టూరిజం స్టాళ్లకు విశేష స్పందన

Satyam News

Leave a Comment