కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. కామెడీ పేరుతో వీడియోలు చేసే సమయ్ రైనా, యూట్యూబర్లు రణవీర్ అల్లాహ్‌బాదియా, ఆశిష్ చంచలానీలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వికలాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను అవమానించే వ్యాఖ్యల కేసులో కోర్టు ఆదేశాలను పాటించకుండా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానిస్తూ ముగ్గురిపై ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమయ్ రైనా తన కార్యక్రమంలో వికలాంగులను ఆహ్వానించి వారికి వేదిక కల్పించాల్సి ఉండగా, ఆయన అలా చేయలేదని కోర్టుకు తెలియజేయడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
అరుదైన జన్యు వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న రోగులకు చికిత్స కోసం నిధులు సమీకరించే లక్ష్యంతో సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని, ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులను తమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఐదుగురు సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు సూచించింది. అలాగే వికలాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎగతాళి చేసినందుకు తమ కార్యక్రమాల్లో బేషరతుగా క్షమాపణలు ప్రకటించాలని కూడా ఆదేశించింది.
అయితే సమయ్ రైనా కోర్టుకు ఇచ్చిన హామీలను బహిరంగంగా ఉల్లంఘించారని ధర్మాసనం పేర్కొంది. “సమయ్ రైనా న్యాయస్థానాన్నే ఆట పట్టించాడు అనే అనుమానానికి ఎలాంటి కారణం లేదు. కోర్టుకు ఇచ్చిన హామీలను ఆయన బహిరంగంగా ఉల్లంఘించారు. నిన్న సమర్పించినట్లు చెబుతున్న అనుసరణ అఫిడవిట్ కూడా వాస్తవానికి దాఖలు కాలేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
విదేశాల్లో ఉండటం వల్ల భారత న్యాయవ్యవస్థ పరిధికి బయట ఉన్నామనే భావనతో వ్యవహరిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. “ఇప్పుడు వారు దాని ఫలితాలు అనుభవించాలి. ఇది అహంకారం కాకపోతే ఆక్స్‌ఫర్డ్ నిఘంటువుకే అర్థం మార్చాల్సి వస్తుంది. ప్రజాజీవితంలో ఇతరులను ఎంత గౌరవిస్తే అంత గౌరవం మీకూ లభిస్తుంది. అవమానించడం ద్వారా కాదు” అని స్పష్టం చేశారు.
క్యూర్ ఎస్‌ఎంఏ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ మాట్లాడుతూ, సమయ్ రైనా తమ సంస్థను ఎప్పుడూ సంప్రదించలేదని కోర్టుకు తెలిపారు. “సంప్రదించడానికి ప్రయత్నించామని మాత్రమే అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయనలాంటి వ్యక్తిని యువతకు ఆదర్శంగా ఎలా భావిస్తారో అర్థం కావడం లేదు” అని ఆమె వ్యాఖ్యానించారు.
భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా “మన యువతకు ఇలాంటి వారికంటే మెరుగైన ఆదర్శ వ్యక్తులు ఉన్నారు” అని అన్నారు. ఇటీవల సమయ్ రైనా తన కొత్త కార్యక్రమంలో వ్యవస్థను పరోక్షంగా ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారని, కార్యక్రమం ప్రారంభంలోనే “గత సిరీస్‌లో చేయని పని ఇప్పుడు చేస్తున్నాను” అంటూ నిమ్మకాయ, మిరపకాయలను వేలాడదీసి కోర్టు చర్యలను పరోక్షంగా వెటకారం చేసినట్లు కనిపించిందని మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎస్‌ఎంఏ ఫౌండేషన్‌ను కూడా సంప్రదించకపోవడం ఆయన అహంకారానికే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌లో ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కార్యక్రమం నిర్వాహకుడు సమయ్ రైనా, అలాగే సామాజిక మాధ్యమ ప్రభావశీలులు విపున్ గోయల్, బలరాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ జగదీశ్ తన్వర్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్‌ఎంఏ చికిత్స ఖర్చులపై సమయ్ రైనా చేసిన వ్యాఖ్యలు బాధితులను అవమానించేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వికలాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారి గౌరవాన్ని కాపాడేందుకు కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం తరహాలో వికలాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని అవమానించే వ్యాఖ్యలను శిక్షార్హ నేరంగా పరిగణించేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదే సమయంలో సమయ్ రైనా సహా సంబంధిత హాస్యనటులు ప్రతి నెల కనీసం రెండు కార్యక్రమాలు నిర్వహించి వికలాంగుల విజయగాథలను ప్రజలకు పరిచయం చేయాలని, ఆ కార్యక్రమాల ద్వారా సమీకరించే నిధులను ముఖ్యంగా ఎస్‌ఎంఏతో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తమ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని కూడా ధర్మాసనం హెచ్చరించింది.
