ఫార్మా సిటీ పేరుతో సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో నేడు ఆమె పాల్గొని ఫార్మా సిటీ బాధిత రైతులకు మద్దతు ప్రకటించారు ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ చేయడం సరికాదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు నిజం చెప్పే ధైర్యం లేదా?
ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలకు నిజాలు చెప్పే ధైర్యం కూడా లేకుండా వ్యవహరిస్తున్నాయని కవిత ఆరోపించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులు పండించే పంటలను కొనుగోలు చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వెల్లడించలేదన్నారు. ముగ్గురు మంత్రులతో కమిటీ వేసి ఈ ఏడాది మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారని, అంటే వచ్చే ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చనే సంకేతాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించిన ఆమె, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో కూడా ముందుగా జీవోలు ఇచ్చి తర్వాత ప్రజలకు సమాచారం అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలతో నిజాయితీగా వ్యవహరించకుండా గోప్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆరోపించారు.
కోర్టు స్టే ఉన్నా భూ సేకరణ ఎలా చేస్తారు?
ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం 13,500 ఎకరాలు సేకరించామని చెప్పిందని, అందులో కుందుకూరు మండలంలో 3,500 ఎకరాలు, యాచారం మండలంలో 6,500 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిపారు. రైతులు పట్టా భూములు ఇవ్వమని చెప్పినా బలవంతంగా భూసేకరణకు ప్రయత్నించారని ఆరోపించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు అదే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.
రావిర్యాల గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో కోర్టు స్టే ఉన్నప్పటికీ ఒక ప్రైవేట్ కంపెనీ పనులు ప్రారంభించిందని, ప్రజలు గట్టిగా పోరాడకపోవడం వల్లే ప్రభుత్వాలకు ధైర్యం వస్తోందని వ్యాఖ్యానించారు. మొదట 13,500 ఎకరాలు అన్న ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం 30 వేల ఎకరాలు కావాలని చెబుతోందని, కానీ ఆ భూములతో ఏం చేస్తారో, ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో, కాలుష్య ప్రభావం ఎంత ఉంటుందో స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
డేటా సెంటర్ల పేరుతో భారీ కాలుష్యాన్ని తెచ్చే ప్రణాళికలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. డేటా సెంటర్ల వల్ల భారీ శబ్ద కాలుష్యం వస్తుందని, అమెరికాలో కూడా అలాంటి కేంద్రాలకు అనుమతుల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల భూములు తీసుకుని వారికి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే వారి భవిష్యత్ జీవనోపాధి ఎలా ఉంటుందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
భూసేకరణలో వివక్ష కొనసాగుతోందని ఆరోపించిన ఆమె, కురిమెట్లలో పెద్ద భూస్వాముల 1,600 ఎకరాల భూములను వదిలిపెట్టి, గిరిజనుల 350 ఎకరాలను మాత్రం తీసుకున్నారని అన్నారు. ఆ గిరిజనుల పోరాటానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రైతులకు, ఉద్యమకారులకు నష్టం జరిగిందని అంగీకరించిన కవిత, ఆ ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ చెబుతున్నానన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో బుల్లెట్ ట్రైన్ వంటి హామీలు ఇస్తున్నారని, కానీ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాలేదని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కారణంగా హైదరాబాద్ కోర్ సిటీ ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఫార్మా సిటీ భూముల విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తామని, పోరాడతామని, సమస్య పరిష్కారం కోసం ముందుండి ఉద్యమం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
