ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది కొత్త టెక్నాలజీ శకానికి శ్రీకారం చుడుతున్న రోజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో నేడు ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్ రాక విశాఖపట్నానికి మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు.
సుమారు 30 ఏళ్ల క్రితం సైబరాబాద్‌ను ఐటీ సిటీగా అభివృద్ధి చేసిన విధంగా, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో కొత్త దశలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పడుతున్న ఈ ప్రాజెక్టు భారత దేశ చరిత్రలో 2026 ఏప్రిల్ 28వ తేదీని ప్రత్యేకంగా నిలిపేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలిచే ఈ ప్రాజెక్టుతో దేశానికి ఏఐ డేటా గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని వెల్లడించారు.
సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైన Google, ఇప్పుడు భారత్ అభివృద్ధికి ఇంజిన్‌లా మారబోతుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే, ఇకపై గూగుల్ ఆంధ్రప్రదేశ్‌ను వెతుక్కుంటూ వస్తుందని ఆసక్తికరంగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలులో Adani Group మరియు Bharti Airtel వంటి దిగ్గజ సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయని తెలిపారు.
2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. నీటి సమస్య ఉండదని, 60 రోజుల్లో గోదావరి నీటిని విశాఖకు తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో కూడా ఏఐ వినియోగాన్ని పెంచుతూ, సీఎంఓలో పనిచేస్తున్న అధికారులతో పాటు ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించి సుపరిపాలన అందించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధి దిశగా బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వంటి పలు కీలక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జూన్ 1 నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనున్నందుకు కేంద్ర రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈస్ట్-వెస్ట్ కారిడార్ అభివృద్ధితో లాజిస్టిక్స్ రంగంలో కూడా పురోగతి సాధిస్తామని పేర్కొన్నారు.
దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చినట్లు సీఎం వెల్లడించారు. ఒప్పందాలు మాత్రమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌లో కూడా రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.
గూగుల్ ప్రాజెక్టుతో విశాఖ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో గతంలో వలసలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికే వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.
2028 నాటికి ArcelorMittal స్టీల్ ప్లాంట్ నుంచి తొలి ఎగుమతులు ప్రారంభమవుతాయని, అలాగే ReNew Power ద్వారా సోలార్ ఉత్పత్తి కూడా మొదలవుతుందని చెప్పారు. అనకాపల్లి జిల్లాను అభివృద్ధి పరంగా మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
