తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ నియమితులయ్యారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నియామకాలు చేసిన పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులను ఇచ్చామని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు, ప్రతి కమిటీలోనూ కొత్త వారిని నియమించినట్లు వివరించారు.
29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను నియమించినట్లు వివరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77, నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరి చొప్పున నియమించినట్లు వెల్లడించారు. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్‌చార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జి గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారని చెప్పారు.
రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ 50 మంది మహిళలకు చోటు, పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించామని పేర్కొన్నారు. జనాభా దామాషా పద్ధతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేసినట్లు స్పష్టం చేశారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు టీడీపీ హై కమాండ్ స్థానం కల్పించింది.
బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించింది. బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాతం చొప్పున కమిటీలో టీడీపీ అధినాయకత్వం స్థానం కల్పించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు చేశారు.
పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియమకాలు చేపట్టారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ కమిటీల కూర్పు చేశామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
