ఏపీలో ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 157 శాఖల్లో ఖాళీల వివరాలను సిద్ధం చేశారు. మొత్తం 99 వేల ఉద్యోగాల నియామకానికి ప్రకటనలు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం రోజున ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియజేస్తూ.. జాబ్ కాలెండర్ ప్రకటించనున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి మంత్రి నారా లోకేశ్ అధికారులతో కలిసి కృషి చేస్తున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి దాదాపు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ వివరాలన్నీ సేకరించి.. పర్మనెంట్ ఉద్యోగుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది మరోసారి టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వివిధ శాఖల్లో వేల సంఖ్యలో వేకెన్సీలు ఉన్నట్లు గుర్తించారు. రెవన్యూ శాఖలో 13 వేలు, ఉన్నత విద్యా శాఖలో 7 వేలు, మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలో 27 వేలు, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 26 వేలు, రవాణా శాఖ దాని పరిధిలోని ఏపీఎస్ఆర్టీసీలో 6 వేల 500, 3 వేల 500 టీచర్ పోస్టులు, నైపుణ్యాభివృద్ధి విభాగంలో 4 వేలు మొత్తం సుమారు 99 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 20 నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఏ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనే విషయం జాబ్ కేలండర్ ద్వారా తెలియజేస్తారు. ఉద్యోగ ప్రకటన గురించి ముందే స్పష్టత వస్తే.. జాబ్ కోసం ప్రయత్నించేవారు ప్రిపరేషన్ షెడ్యూల్ పక్కాగా ప్లాన్ చేసుకొనే అవకాశం దొరుకుతుంది.
