పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, రైతుల నడ్డి విరుస్తూనే రైతులకు భరోసా ఇస్తామంటూ బీజేపీ చేపడుతున్న బస్సు యాత్రలు పూర్తిగా రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. “రైతు ఘోస – బీజేపీ భరోసా” పేరుతో చేస్తున్న యాత్రలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు.
తెలంగాణ రైతులపై నిజమైన ప్రేమ ఉంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు భారీగా పెరిగి రైతులపై సాగు భారం అధికమైందన్నారు. అయితే రైతు సంక్షేమం గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఈ అంశంపై మాత్రం మౌనం పాటిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రైతుల్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలం
ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బాయిల్డ్ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో, లేవీ రైస్ సాంక్షన్‌లో కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం యాభై మూడు లక్షల డెబ్బై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకే అనుమతి ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఎనిమిది లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరవై ఒక కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల కనీస మద్దతు ధర చెల్లించిందన్నారు.
ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, అరవై సంవత్సరాలు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. వ్యవసాయ చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురిచేసి, వందలాది మంది రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు రైతులకు భరోసా ఇస్తామని చెప్పడం నమ్మశక్యం కాదన్నారు.
పెద్ద పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు మాత్రం రుణమాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం పది రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం సిగ్గుచేటని, దీనిపై కేంద్రం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీ చార్జి
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీచార్జీలు చేసిన ఘటనలను ప్రజలు మరవలేదన్నారు. రైతుల బాధలను పట్టించుకోని బీజేపీ నేతలు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం కపట నాటకమని మండిపడ్డారు. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రైతులు బీజేపీ నాయకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
