23.7 C
Hyderabad
September 25, 2026
హైదరాబాద్హోమ్

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

#RevanthReddy

రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు అవుతున్న అల్పాహార భోజనానికి భారీ ఎత్తున విరాళాలు అందాయి. హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీఎస్‌ఆర్ నిధులను అందజేశారు.

ఈ సందర్భంగా అరబిందో ఫార్మా లిమిటెడ్ తరఫున రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తరఫున రూ.12.18 కోట్లను హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి సమక్షంలో అందజేశారు. ఈ నిధులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకం నిర్వహణకు వినియోగించనున్నారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు స్థానిక రైతులకు కూడా ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.

రాష్ట్రంలో సెంట్రలైజుడు వంటశాలలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అవసరమైన కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందుకోసం రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల పంట మార్పిడి విధానానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమానికి సహకరిస్తూ సీఎస్‌ఆర్ నిధులు అందించిన దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్ ప్రభుజీ, దివీస్ లేబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు, అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Satyam News

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News

కొత్త సినిమాలతో మళ్లీ కలకలం రేపుతున్న ఐబొమ్మ

Satyam News

ఖమ్మం వైద్యుని సజీవ దహనం

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

Leave a Comment