తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించనున్నారు. 2009 నవంబర్ 29న అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ, ఉద్యమ పోరాట స్ఫూర్తిని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
నవంబర్ 29న సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
