హైదరాబాద్హోమ్

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

#ktr

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్..  ముఖ్యమంత్రులుగా చరిత్రలో నిలిచిపోయే పాలన చేశారని… వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. మంచి షో చూపిస్తున్నారని కేటీఆర్ కామెంట్‌ చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో నిరసన తెలియజేస్తే.. తీవ్రంగా స్పందించారు. మా రాష్ట్రంలో మీ లొల్లి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తర్వాత జరిగిన ఎన్నికల్లో అటు తెలంగాణలో.. ఇటు ఏపీలో.. ప్రభుత్వాలు మారిపోయాయి. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ స్వరంలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు సడెన్‌గా చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్, వైఎస్సార్ చారిత్రాత్మక పాలన అందించారని ప్రశింసించడం వెనుక రాజకీయ అవసరాలే కనిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన సెటిలర్ల ఓట్లు కీలకం. వీరిలో టీడీపీ అభిమానులను, వైసీపీ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరిచేలా ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు వైఎస్సార్‌ని పొగిడేశారు. ఇక్కడ ఏ ఒక్క వర్గం ఓట్లను వదలుకోకూడదు అనే వ్యూహం కనిపిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్‌.. ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. కానీ చంద్రబాబును ఇప్పటికీ ప్రత్యర్ధిగా చూస్తున్న బీఆరెస్.. నిన్న మొన్నటి వరకు ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసింది. అదే సమయంలో టీడీపీ ప్రధాన ప్రత్యర్ధి అయిన వైసీపీకి బీఆర్ఎస్ ఫుల్‌ సపోర్ట్ ఉందని అందరికీ తెలుసు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలతో హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రాంత ఓటర్లు కీలకం అనే క్లారిటీ వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌లోనే అత్యధిక స్థానాలు దక్కాయి. ఈ బలం నిలవాలంటే.. సెటిలర్ల మద్దతు కావాలి.

కాంగ్రెస్‌ సీఎం అయినా.. గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన చరిత్రను దృష్టిలో పెట్టుకొని.. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు రేవంత్‌రెడ్డి వైపు మొగ్గు చూపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపించాలంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ జెండా పట్టుకున్న సెటిలర్లను మళ్లీ కారెక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్టీఆర్, చంద్రబాబు పాలనపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చిన్న బాస్ వ్యూహం సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

Related posts

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక అడుగు

Satyam News

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News

జగన్ రెడ్డి విధ్వంసకర పాలన ముగిసి రెండేళ్ళు

Satyam News

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

Satyam News

యూపీలో పట్టుబడ్డ స్టాండప్ కమెడియన్ అనుదీప్

Satyam News

గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….

Satyam News

Leave a Comment