25.2 C
Hyderabad
September 20, 2026
విజయనగరంహోమ్

మోడీ పాలనలో అన్నీ సచ్చే దినాలే… అచ్చే దినాల్లేవు

#BugataAshok

పుష్కర కాలం మోడీ పాలనలో ఎక్కడ అచ్చే దినాల్లేవని అన్నీ సచ్చే దినాలేనని సీపీఐ రాష్ట్ర నేత బుగత అశోక్ ఆరోపించారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా విజయనగరం చారిత్రక గంటస్థంభం వద్ద వినూత్నంగా గ్యాస్ బండలను నెత్తిన పెట్టుకొని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఆ గ్యాస్ బండలపై ప్రధాని మోడీ, ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలతో నిరసనలు వ్యక్తం చేశారు.

మోడీ 12 ఏళ్ళ పాలనలో అచ్చేదినాలేమో గాని ఆర్ధిక భారాలతో దేశ ప్రజలకు అన్నీ సచ్చేదినాలే అంటూ విమర్శించారు.ఓట్లేసిన పాపానికి ధరలు పెంచి ఆర్ధిక భారాలతో ప్రజల పై కక్ష సాధిస్తారా..!అంటూ గళమెత్తారు.దేశంలో ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్, వాణిజ్య గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపిందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ తీవ్రంగా విమర్శించారు.

ఈ మేరకు విజయనగరం  గంటస్థంభం దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) కార్యదర్శి బుగత అశోక్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మోడీ, బాబు, పవన్ లు ప్రజల పై ధరలు పెంచి ప్రజల నెత్తిన ఆర్ధిక భారాలు మోపుతున్నారని ఆ ముగ్గురు ఫోటోలతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా సీపీఐ నేత బుగత అశోక్ మాట్లాడుతూ రెండు నెలల్లో రెండు దఫాలు గ్యాస్ ధర పెంచిన పీఎం మోడీ నిరంకుశత్వ విధానాలు అవలంబిస్తున్నారన్నారు.

కార్పొరేట్ సంస్థల లాభం కోసం పేదల కడుపు కొడుతున్నారు…

ఒకప్పుడు “అచ్చే దిన్” పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, నేడు కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రజల జేబులను ఖాళీ చేసే విధానాలను అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. వంట గ్యాస్ అనేది విలాస వస్తువు కాదు, ప్రతి ఇంటి అవసరం. అలాంటి అత్యవసర వస్తువుపై పదే పదే ధరలు పెంచడం అంటే పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక దాడి చేయడమేనని అన్నారు.

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన ప్రతిసారి దాని ప్రభావం కేవలం వంటింటికే పరిమితం కాకుండా హోటళ్లు, చిన్న వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులపై పడుతూ చివరకు ప్రతి కుటుంబం ఖర్చులను పెంచుతోందన్నారు. దీంతో కూలీలు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని నిత్యావసరాలకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనం పాటించడం బాధాకరమని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల పక్షాన మాట్లాడిన నాయకులు, నేడు ధరల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం రాజకీయ వైఫల్యమని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ప్రజలపై పన్నులు, ధరల భారాలు పెంచుతూ, మరోవైపు కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడం దేశ ఆర్థిక విధానంలో పెరుగుతున్న అసమానతలకు నిదర్శనమని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనపడుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, వంట గ్యాస్‌పై సబ్సిడీని పునరుద్ధరించాలని, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో గ్యాస్ అందించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు దశలవారీగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బుగత అశోక్ ప్రకటించారు.

“ప్రజల వంటింట్లో మంటలు రగులుతున్నప్పుడు పాలకులు మౌనం వహిస్తే, ఆ మౌనాన్ని ప్రజా ఉద్యమాలతో ఛేదించడం సీపీఐ బాధ్యత. గ్యాస్ ధరలు తగ్గించే వరకు మా పోరాటం ఆగదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు ఎస్. రంగరాజు, పొందూరు అప్పలరాజు, బూర వాసు, సూరిడమ్మ మహిళలు, కార్మికులు పాల్గొన్నారు.

Related posts

అండమాన్ నికోబార్ దీవుల్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావదినోత్సవం

Satyam News

లైంగిక వ్యాధులతో బిల్ గేట్స్… నిజామా?

Satyam News

బర్కత్ పుర పీఎఫ్ కార్యాలయంలో ఘనంగా బోనాలు పండుగ

Satyam News

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Satyam News

పరిశ్రమల మనుగడకు పటిష్ట నీటి నిర్వహణే కీలకం

Satyam News

Leave a Comment