26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

#PankajAgarwalIAS

ప్రభుత్వ ధనాన్ని కాపు కాయాల్సిన ఐఏఎస్ అధికారులే దాన్ని కొల్లగొట్టారు. హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎనిమిది శాఖలు, చండీగఢ్ పరిపాలనకు చెందిన రెండు శాఖల బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో నిధులు అక్రమంగా మళ్లించిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇది మొత్తం రూ.657 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసుగా నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ రెండో ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసింది.

2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పంకజ్ అగర్వాల్ ను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి రామ్ కుమార్ సింగ్  అరెస్టు కాగా, పంకజ్ అగర్వాల్ రెండో ఐఏఎస్ అధికారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారులతో పాటు కొందరు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో మొత్తం నష్టం రూ.657 కోట్లుగా సీబీఐ అంచనా వేయగా, ఇదే కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నష్టం రూ.645 కోట్లుగా పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నష్టం పరిమాణంపై తుది నిర్ధారణ ఇంకా వెలువడాల్సి ఉంది.

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ పరిపాలనా కార్యదర్శిగా పంకజ్ అగర్వాల్ పనిచేసిన కాలానికి సంబంధించిన అంశాలు ఆయన అరెస్టుకు కారణమైనట్లు తెలుస్తోంది. హర్యానా స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు ఖాతా నుంచి రూ.10 కోట్ల నిధులు అక్రమంగా మళ్లించబడినట్లు సీబీఐ గుర్తించింది. ఇందులో రూ.9.75 కోట్లు ఎస్‌ఆర్‌ఆర్ ప్లానింగ్ గురుస్ లిమిటెడ్‌కు, రూ.25 లక్షలు మన్నత్ కాంట్రాక్టర్స్‌కు బదిలీ అయినట్లు విచారణలో వెల్లడైంది. ఈ రెండు సంస్థలు షెల్ కంపెనీలుగా పనిచేసి ప్రభుత్వ నిధులను మళ్లించేందుకు ఉపయోగించబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నారు. వారిలో ఇద్దరు ఇప్పటికే అరెస్టు కాగా, మిగిలిన వారిలో మహ్మద్ షయాన్, మని రామ్ శర్మ, ప్రదీప్ కుమార్, వినీత్ గార్గ్, సాకేత్ కుమార్, డి కె భీరా ఉన్నట్లు సమాచారం.

పంకజ్ అగర్వాల్ పాత్ర హర్యానా స్కూల్ శిక్షా పరియోజన పరిషత్ నిధుల అక్రమ బదిలీల వ్యవహారంలో కూడా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఆయన పాఠశాల విద్యాశాఖ పరిపాలనా కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ఈ ఖాతాలు ప్రారంభించబడ్డాయని, ఆ ఖాతాల ద్వారా రూ.50 కోట్లకు పైగా నిధులు మళ్లించబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అలాగే హర్యానా స్కూల్ శిక్షా పరియోజన పరిషత్, హర్యానా స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు ఖాతాలు రెండూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయన పదవీకాలంలోనే ప్రారంభించబడినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదు.

Related posts

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై శుభవార్త

Satyam News

ఆక్రమిత కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద శిబరాలు?

Satyam News

మధ్యాహ్న భోజనంలో అవినీతి మరకలు

Satyam News

మార్చి తో ముగియనున్న సి ఎస్ పదవీకాలం

Satyam News

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

Satyam News

కొడుకు, కోడలి ఖాతాల్లోకి లిక్కర్ సొమ్ము..అడ్డంగా దొరికిన కారుమూరి.!

Satyam News

Leave a Comment