ప్రత్యేకంహోమ్

గెలిచిన కాక్రోచ్: విద్యార్థులపై కేసులు కొట్టేసిన ‘సుప్రీం’

#CockrochJanathaParty

కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి విజయం సాధించింది. నీట్ ప్రశ్నా పత్రం లీక్ పై జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై అన్ని కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టు నేడు ఆదేశించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూలై 20 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

నీట్‌, ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తమ 36 రోజుల ఆందోళనను జూలైలో విరమించేటప్పుడు సీజేపీ చేసిన ప్రధాన డిమాండ్లలో ఒకటి నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవడం. ఈ మేరకు ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. అయితే జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని సీజేపీ ఆరోపిస్తూ, సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు భారీ నిరసన మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సంబంధిత కేసును విచారిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ పి. మోహనా ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. యువ నిరసనకారుల భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి ‘పూర్తి న్యాయం’ చేయాలని నిర్ణయించినట్లు ధర్మాసనం పేర్కొంది.

జూలై 20 నుంచి 25, 2026 మధ్య దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థి నిరసనకారులపై నమోదైన కేసులైనా మూసివేసినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో వ్యక్తిగతంగా నిందితులుగా పేర్కొన్న వారిపై ఉన్న కేసులకు ఈ వెసులుబాటు వర్తించదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు.

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ జూలైలో సీజేపీ నేతలకు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థి నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు కేంద్రంతో పాటు మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అయితే తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ఇప్పటికే వ్యక్తిగతంగా నిందితులుగా ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి ఈ కేసులను పూర్తిగా ముగించాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టు ముందున్న కేసులో ‘పూర్తి న్యాయం’ జరిగేలా అవసరమైన ఏ ఆదేశాన్నైనా సుప్రీంకోర్టు జారీ చేయవచ్చు.

కేంద్ర ప్రభుత్వం సోమవారమే విద్యార్థి నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఆర్టికల్ 142 కింద కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ అంశంపై సోమవారం కోర్టు సమయం ముగియడానికి కొద్దిసేపటి ముందు తుషార్ మెహతా అత్యవసర విచారణ కోసం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను కొట్టివేయడానికి ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ దాఖలు చేస్తామని, ఆర్టికల్ 142ను వినియోగించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.

సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ సుప్రీంకోర్టు ముందు తమ సంస్థ సెప్టెంబర్ 5న నిర్వహించనున్న మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన సానుకూల హామీలు, వాటికి సుప్రీంకోర్టు కల్పించిన న్యాయపరమైన భరోసా, మంగళవారం వెలువడిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని మార్చ్‌ను రద్దు చేస్తున్నామని తెలిపారు. కోర్టు నిర్ణయానికి, ఇరుపక్షాల తరఫున వాదించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.

నీట్ ప్రశ్నపత్రం లీక్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే అంశంపైనా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు మూడు నెలల్లో పరిహారం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లో ఖరారు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పును సీజేపీ నేత సౌరవ్ దాస్ ‘చారిత్రాత్మక నిర్ణయం’గా అభివర్ణించారు. విద్యార్థులపై నమోదైన కేసులను మూసివేయడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు మార్గం సుగమం కావడంతో తమ ప్రధాన డిమాండ్లలో కీలకమైన అంశాలపై పరిష్కారం లభించినట్లయిందని సీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

Related posts

రూ.కోట్లు కొల్లగొట్టిన దాల్ మిల్ సూరి అరెస్టు

Satyam News

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా ఆశ

Satyam News

ఇరాన్ షరతులకు ట్రంప్ లొంగిపోవాల్సి వచ్చిందా?

Satyam News

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News

21 నుంచి శ్రీ ఆదిశంకరాచార్యుల రథయాత్ర ప్రారంభం

Satyam News

22A భూముల వ్యవహారంలో ఏ-1 రేవంత్, ఏ-2 పొంగులేటి

Satyam News

Leave a Comment