25.2 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

మమత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

#SupremeCourtOfIndia

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా సహించేది లేదని రాష్ట్ర యంత్రాంగాన్ని ధర్మాసనం హెచ్చరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలు, పరిపాలనాపరమైన అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, అభ్యంతరాలు మరియు క్లెయిమ్‌ల దాఖలుకు గడువును మరో వారం రోజుల పాటు, అంటే 2026 ఫిబ్రవరి 21 వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించేందుకు గ్రూప్-బి అధికారులను అందుబాటులో ఉంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు (EROs) మాత్రమే ఉంటుందని, మైక్రో అబ్జర్వర్లు కేవలం వారికి సహాయకులుగా మాత్రమే వ్యవహరించాలని స్పష్టం చేసింది.

ఎన్నికల అధికారులపై దాడులు, బెదిరింపులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అధికారుల భద్రత కోసం తీసుకున్న చర్యలపై వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని పశ్చిమ బెంగాల్ డీజీపీని ఆదేశించింది. “ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మేము ఎటువంటి ఆటంకాలను అనుమతించబోము. అవసరమైన స్పష్టత ఇస్తాం కానీ, ఈ ప్రక్రియ సజావుగా సాగాల్సిందే” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా, ప్రక్రియ మొత్తం పారదర్శకగా, నిష్పక్షపాతంగా జరగాలని కోర్టు నొక్కి చెప్పింది. ఓటర్ల జాబితాలో భారీస్థాయిలో పేర్ల తొలగింపు జరగకూడదని, ప్రతి ఒక్కరి హక్కును కాపాడాలని సూచించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తాము నిరంతరం పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Related posts

నేషనల్స్ కు తెలంగాణ రాష్ట్ర సీనియర్  స్విమ్మింగ్ జట్టు

Satyam News

పశ్చిమబెంగాల్ లో మసీదుల్లో మైకులు బంద్

Satyam News

ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్‌

Satyam News

మొట్టమొదటి ఏఐ-ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీ

Satyam News

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

Satyam News

రామతీర్థ పుణ్య క్షేత్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

Satyam News

Leave a Comment