ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను CID కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన బిహార్ క్యాడర్ IPS అధికారి సునీల్ నాయక్‌ను పట్నాలో అరెస్టు చేసేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయలేకపోవడంపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
సునీల్ నాయక్‌ను అరెస్టు చేసినట్లు చెప్పి ఏపీకి తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం పట్నాలోని స్థానిక కోర్టులో హాజరు పరచగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సునీల్‌నాయక్‌ను అరెస్టు చేసినప్పటికీ పట్నా నుంచి ఏపీకి తీసుకురావటం సాధ్యం కాలేదు.
ఐతే ఈ మొత్తం ఎపిసోడ్ …నరాలు తెగే ఉత్కంఠతో నడిచింది. సునీల్ నాయక్‌ను కోర్టుకు తరలించకుండా ఉండేందుకు దాదాపు 500 మందికి పైగా బిహార్ పోలీసులు, హోంగార్డులు ఏపీ పోలీసుల బృందాన్ని చుట్టుముట్టారు. వాహనాలకు అడ్డం పడుతూ, మెడికల్ పరీక్షలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పట్నా నడిబొడ్డున ఆంధ్రుడు మూవీ క్లైమాక్స్ తరహాలో హైడ్రామా నడిచింది.
ఐనప్పటికీ…ఏమాత్రం బెదరకుండా, SP దామోదర్ బృందం చాకచక్యంగా ఆ అడ్డంకులన్నీ అధిగమించి, సునీల్ నాయక్‌ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లి, తర్వాత కోర్టులో హాజరుపరిచింది. సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు, బీహార్ పోలీసులు AP బృందాన్ని వాదనలు వినిపించనీయకుండా అడ్డుకున్నారు.
కేస్ డైరీ, అరెస్ట్ వారంట్ లేవంటూ తప్పుడు వాదనలతో కోర్టును తప్పుదోవ పట్టించారని సమాచారం. దీంతో సాంకేతిక కారణాల వల్ల కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించి, 30 రోజుల వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో సునీల్ నాయక్‌కు తాత్కాలిక రిలీఫ్ లభించినా, ఏపీ పోలీసులు మాత్రం పైకోర్టులో అప్పీలుకు రెడీ అవుతున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో CID కస్టడీలో రఘురామపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటికే విజయ్‌పాల్, తులసిబాబు అరెస్టయ్యారు. ఇప్పుడు సునీల్ నాయక్ అరెస్టుతో ఈ సంఖ్య మూడుకు పెరిగింది. వైసీపీ హయాంలో కన్నుమిన్నూ తెలియకుండా ప్రవర్తించిన అధికారులకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది.
ఈ కేసులో తదుపరి టార్గెట్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి సీఐడీ చీఫ్ PV సునీల్ కుమార్ వైపు అడుగులు పడుతున్నాయా అనే చర్చ మొదలైంది.
