హైదరాబాద్హోమ్

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

#Ponguleti

ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల   ప్రాణాలను కాపాడ‌డం, వీలైనంత వ‌ర‌కూ  ఆస్తులకు న‌ష్టం క‌ల‌గ‌కుండా  చూడ‌డ‌మే ల‌క్ష్యంగా  ప్రభుత్వ ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌నల మేర‌కు  ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామ‌ని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్‌సైజ్‌లలో భాగంగా, హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి  ప్రారంభించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో విపత్తు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక పరికరాలను పరిశీలించి, వాటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను, ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సహకారంతో నిర్వహిస్తున్న ఈ మాక్ డ్రిల్ ద్వారా లభించే అనుభవాలతో అధికారులు విపత్తుల సమయంలో మరింత బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వేగవంతమైన స్పందన, వివిధ శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధత ఎంతో కీలకమని ఆయన అన్నారు.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట ఎంతో కీలకమైనదని, దానిని ‘గోల్డెన్ అవర్’గా పరిగణించాలని పేర్కొన్నారు. ఆ సమయంలో సిబ్బంది అంతా పూర్తి సమన్వయంతో పనిచేస్తూ, అందుబాటులో ఉన్న అత్యాధునిక ఎక్వీప్‌మెంట్‌ను సరిగ్గా వినియోగించి ప్రజలకు తక్షణ సేవలు అందించాలన్నారు. అగ్నిప్రమాదాలు, వరదల సమయంలో అన్ని వ్యవస్థలు సకాలంలో స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రమాదం జరిగిందనే కాల్ రాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో, సరైన ప్రాంతానికి చేరుకుని బాధిత ప్రజలకు సకాలంలో వైద్య, రక్షణ సేవలు అందించడం అధికారుల బాధ్యత అని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు

వరదలు, అగ్నిప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వేగంగా సహాయక చర్యలు చేపట్టడం, అత్యవసర సేవలను సమన్వయం చేయడం కోసం ఇటువంటి మాక్ డ్రిల్‌లు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గత చరిత్రను గుర్తుచేశారు. 1908లో సంభవించిన హైదరాబాద్ మహావరదలను, ఇటీవలి కాలంలో వచ్చిన గోదావరి–కృష్ణా నదుల వరదలను ప్రస్తావిస్తూ… విపత్తుల విషయంలో అప్రమత్తత లేకపోతే ఎంతటి ఘోర నష్టం జరుగుతుందో చరిత్ర చెబుతోందన్నారు.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన రెస్క్యూ బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలు పచ్చదనాన్ని నాశనం చేస్తుంటే, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో అత్యుత్తమ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.

కనువిందు చేసిన రెస్క్యూ ఆపరేషన్లు

మాక్ డ్రిల్‌లో భాగంగా గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, సమన్వయంతో కూడిన రెస్క్యూ ఆపరేషన్‌లను ప్రత్యేక బృందాలు ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించాయి. అనంతరం మంత్రి నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్‌ను సందర్శించి అక్కడి రెస్క్యూ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత విస్తృత స్థాయిలో మాక్ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహణ శాఖ ,జిల్లా అధికారులను మంత్రి అభినందించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రదర్శనలు కేవలం ముందస్తు సన్నద్ధతలో భాగంగా నిర్వహిస్తున్న మాక్ డ్రిల్‌లేనని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన, నిజమైన సమాచారమే చేరాలని, పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.

ఈ భారీ మాక్ డ్రిల్ కార్యక్రమంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా  కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఎన్‌డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ (రిటైర్డ్) సుధీర్ బెల్ పాల్గొన్నారు. వీరితో పాటు పోలీస్, ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ , రెవెన్యూ, వైద్య ఆరోగ్య, జీహెచ్ఎంసీ , హైడ్రా, పరిశ్రమలు, రవాణా, పశుసంవర్ధక, వెటర్నరీ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మాక్ డ్రిల్‌ను విజయవంతం చేశారు.

Related posts

జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!

Satyam News

కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి?

Satyam News

జోగి రమేష్… కబుర్లు ఆపి పోలీసులకు లొంగిపో…

Satyam News

పాకిస్తాన్ లో నేటి నుంచి లాక్ డౌన్

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

భారీ క్షిపణి దాడులు చేసిన IRGC

Satyam News

Leave a Comment