బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి, అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆలయం వద్ద సరైన రోడ్లు, త్రాగునీరు, వసతి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వసతి సౌకర్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, దానిని దృష్టిలో ఉంచుకొని 50 కాటేజీల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం 80 శాతం వరకు నిర్మాణ పనులు జరిగాయని తెలిపారు.
భక్తుల మొక్కుల ద్వారా స్వామికి వచ్చిన ఆదాయంతో స్వామికి బంగారు కిరీటం చేయించినట్లు వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల వలన వేలల్లో ఉన్న స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరిందని చెప్పారు. గతంలో స్వామి వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయల వరకు ఉండగా, ఇప్పుడు 22 కోట్ల రూపాయల కు పెరిగిందని చెప్పారు.
స్వామి వారి ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. 50 కాటేజీల మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా 100 కాటేజీలను నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే 100 కాటేజీల నిర్మాణం చేపట్టి భక్తులకు అందుబాటులోకి తేవాలన్నారు. సుదూర ప్రాంతాల భక్తుల ను దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ మంజూరు చేయించడం జరిగిందని, రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయినప్పటికీ రైళ్ళు ఆగడం లేదని తెలిపారు.
కొమురవెల్లి స్టేషన్ లో రైళ్ళను ఆపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే స్టేషన్ అందుబాటులో కి వస్తే దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యం గా ఉంటుందని చెప్పారు.
కొండ పోచమ్మను దర్శించుకున్న తలసాని
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారి మహేందర్ రెడ్డి ఉన్నారు.
