కరీంనగర్హోమ్

రైతు బాధలు వింటే కడుపు తరుక్కపోతోంది

#HarishRao

రైతుల బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత టీ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోపాల్రావు పల్లి గ్రామంలో రైతులతో చెట్టు కింద కూర్చొని మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలు, సమస్యలను ఆయనకు వివరించారు. ప్రభుత్వం సకాలంలో చెరువులు, కుంటలు నింపకపోవడం వల్ల పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల్లో పూడిక తీయకపోవడంతో సాగు నీటి సరఫరా సరిగా లేకపోతుందని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గిపోవడం, సాగునీటి కొరత కారణంగా అప్పులు చేసి బావుల్లో పూడిక తీయాల్సి వస్తోందని రైతులు చెప్పారు.

యూరియా సరఫరా సరిగా లేదని, ఓటీపీ విధానం కారణంగా ఎరువులు తీసుకోవడం కష్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు లేని, చదువు తెలియని రైతులకు యాప్ ద్వారా యూరియా తీసుకోవడం కష్టంగా మారిందన్నారు. యూరియా కోసం చెప్పులు పెట్టి లైన్లలో నిలబడాల్సి వస్తోందని వారు తెలిపారు.

రైతు బంధు సకాలంలో అందడం లేదని, కోతల కాలం వచ్చినా రైతు భరోసా అందడం లేదని రైతులు పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు సమయానికి వచ్చేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు, యూరియా, విద్యుత్ వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు.

రుణమాఫీ విషయంలో కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో మహిళా సంఘాల ద్వారా అప్పులు తెచ్చి చెల్లించినా మాఫీ కాలేదని రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరో రైతు లచ్చన్న మాట్లాడుతూ ఐదు ఎకరాలు ఉన్నా నీటి సరఫరా లేక పంటలు సాగు చేయడం కష్టమైందన్నారు. ఉప్పు లచ్చయ్య అనే రైతు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు, కుంటలు నీటితో నిండిపోయేవని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.

గ్రామంలో సుమారు 70 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వినతిపత్రం కూడా హరీశ్ రావుకు అందజేశారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో సుఖంగా ఉన్నారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ తమ కష్టాలు చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.

బావుల్లో నీరు లేక పూడిక తీయడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారని హరీశ్ రావు తెలిపారు. రైతుల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తప్పకుండా ప్రస్తావిస్తుందని చెప్పారు. గోపాలరావుపల్లి గ్రామ రైతులకు తక్షణం సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ఎస్సార్ఎస్పీ పునరుజ్జీవం, మల్కంపేట రిజర్వాయర్, గౌరవెల్లి ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. కరీంనగర్ ప్రాంతంలో పంటల దిగుబడి పెరగడానికి అవే కారణమని అన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. చెక్ డ్యాంలు నిర్మించారా, ప్రాజెక్టులు కట్టారా, కాల్వలు తవ్వారా అని ప్రశ్నించారు. రైతు బంధు, బోనస్ వంటి పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు.

మేడిగడ్డ మరమ్మతులు ఎందుకు చేయడం లేదని, ఎల్లంపల్లి, నారాయణ్‌పేట ప్రాంతాల్లో మోటార్లు నిలిపివేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమపై కోపం ఉంటే జైల్లో పెట్టాలని, కానీ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

తిరుమల దండయాత్ర పై తోక ముడిచిన జగన్ ?

Satyam News

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

భవిష్యత్తు అవసరాలకే తెనాలి రోడ్డు విస్తరణ

Satyam News

అక్రమ లే-అవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం

Satyam News

జనవరిలో జాబ్‌ కేలండర్‌…. 2026లో ఉద్యోగాల పండుగ..

Satyam News

Leave a Comment