హైదరాబాద్ దోమల బెడద ఎక్కువగా ఉన్నాయని వరుస పిర్యాదుల నేపథ్యంలో దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ జిల్లా 99 రోజుల కార్యాచరణ లో ప్రధానంగా దోమల బెడద తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై వెంటనే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ ప్రాంతంలో దోమల సాంద్రతను తగ్గించేలా ఎంటమాలజికల్ సర్వైలెన్స్‌ను బలోపేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. అధిక దోమల ప్రభావిత ప్రాంతాల్లో 100% జ్వరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల్లో రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గత 3 సంవత్సరాల డేటా ఆధారంగా అధిక దోమల ప్రభావిత ప్రాంతాల్లో వచ్చిన వ్యాధుల ఆధారంగా వార్డులు, PHC ల ద్వారా గుర్తించి అక్కడ ప్రాథమిక లార్వా సర్వేలు నిర్వహించి దోమల సాంద్రతను నియంత్రణ స్థాయిలో ఉంచాలని పేర్కొన్నారు.గత 12 నెలల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా కేసుల లైన్ లిస్టింగ్ చేసి ప్రధాన ప్రాంతాలైన పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, నీటి నిల్వ ప్రాంతాలు, స్లమ్ ప్రాంతాలను గుర్తించి వార్డ్ వారీగా మైక్రో ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి ఫాగింగ్ & IRS షెడ్యూల్ నిర్వహించాలి.
ప్రతి వారం “డ్రై డే” నిర్వహిస్తూ నీటి నిల్వలు తొలగించాలి. టెమెఫోస్ రసాయనాల వినియోగం, చేపల ద్వారా లార్వా నియంత్రణ, చెరువులు, కాలువల్లో ఆయిల్ బాల్స్ విడుదల, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఫాగింగ్,నిర్మాణ స్థలాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల పరిశీలన చేయాలని సూచించారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికీ జ్వరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.
అధిక ప్రమాద ప్రాంతాల్లో ఫీవర్ క్యాంపులు నిర్వహణ చేయాలని ఆదేశించారు. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే తప్పనిసరిగా పరీక్షలు. IDSP ద్వారా ప్రతిరోజూ నివేదికలు అందించాలన్నారు. లార్వా సర్వేలు మళ్లీ నిర్వహించి ప్రాథమిక సర్వేతో పోల్చి మలేరియా ప్రాంతాల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే (IRS) చేయాలని వారానికొకసారి ఎంటమాలజీ నివేదికలు అందించాలన్నారు.ప్రజల సహకారంతో నీటి తొట్లు తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలని, పెద్ద స్థాయిలో ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజల భాగస్వామ్యం,పాఠశాలల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు – RWAs కాంట్రాక్టర్లు, వాటర్ వర్క్స్ విభాగం సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి ఆదివారం “10 నిమిషాలు దోమల నివారణకు” మీడియా ప్రచారం నిర్వహించాలన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తూ దోమల పెంపక స్థలాలను జియో ట్యాగింగ్ చేయడం, లార్వా సాంద్రత మ్యాపింగ్ ద్వారా పరిస్థితులను నిరంతరం సమీక్ష చేయాలని తెలిపారు.
ప్రజలు తమ ఇళ్లలో మరియు పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల నియంత్రణలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
