రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం పూర్తి చేసేది.. ప్రారంభోత్సవాలు చేసేది.. కూటమి ప్రభుత్వమే అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం పోర్టు గురించి వైసీపీ నాయకుల ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా తప్పుడు ప్రచారాలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
దండుపాళ్యం బ్యాచ్ బందరుకి వచ్చి.. ఏదో ఉద్దరించినట్లు మాట్లాడారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు నిర్మాణంపై వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పోర్టును మచిలీపట్నం నుంచి గోగిలేరుకు తరిమేయడానికి ప్రయత్నించి.. లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని అని ఆరోపించారు.
రైతులకు పరిహారం చెల్లించి.. ప్రజలను ఒప్పించి.. 2019లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల వరకు పోర్టు గురించి పట్టించుకోలేదు. 2023 మేలో ఎన్నికలకు ఏడాది ముందు అప్పటికే శంకుస్థాపన చేసిన పోర్టుకు మరోసారి శంకుస్థాపన చేసి జగన్ సర్కారు డ్రామాలు ఆడింది. ఫిషింగ్ హార్బర్ పనుల్లో జగన్ అండ్ కో కమీషన్లు దండుకోవడం మినహా.. పనులు చేయలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.
వైసీపీ హాయంలో కమిషన్ల కోసం కియా పరిశ్రమను వేధించి.. జాకీ, అమర్‌రాజా వంటి సంస్థలను ఏపీ నుంచి తరిమేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పెట్టుబడులను తరిమేసే చరిత్ర వైసీపీది అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి.. అంతర్జాతీయ కంపెనీలను ఏర్పాటు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం సొంతం. రెండేళ్లలోనే మచిలీపట్నం పోర్టు పనులు 40 శాతం పూర్తయ్యాయి.
ఈ ఏడాది చివరికి బందరు పోర్టుని ప్రారంభించాలనే లక్ష్యంలో పనులు చేస్తున్నారు. మచిలీపట్నంతో పాటు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేసి.. రామయపట్నం, దుగరాజపట్నం పోర్టు పనులను వేగవంతం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఏపీకి వస్తున్న భారీ పరిశ్రమలు మరో రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తాయి. అప్పుడు ఈ సంస్థలు తయారు చేసే వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడానికి పోర్టులను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రచారమే తప్ప పెట్టుబడులు వచ్చింది లేదు. ఆ సమయంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మంత్రి కొల్లు రవీంద్ర.. పోర్టు పనులు పూర్తి చేయడమే కాకుండా.. ప్రారంభోత్సవాలు చేసి చూపిస్తామని స్పష్టం చేస్తున్నారు.
