25.7 C
Hyderabad
July 9, 2024 03: 50 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ నుంచి జంప్ అవుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు

#KCR

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా పరువు నిలబెట్టుకోలేకపోయింది. దాంతో బీఆర్ఎస్‌ నుంచి జంపింగ్‌లు పెద్ద ఎత్తు మొదలయ్యాయి. దీంతో ఇక బీఆర్ఎస్‌ ఉంటుందా.. ఊడిపోతుందా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలై.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసుల రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇలా మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు.

దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకోకమునుపే.. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, ఎం.ఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేష్, బొగ్గవరపు దయానంద్, బసవరాజ్ సారయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగితే.. ఎమ్మెల్సీలు ఒకేసారి ఆరుగురు ఇలా జంప్ కావడం హైకమాండ్‌కు ఊహించని షాకేనని చెప్పుకోవచ్చు. దీంతో ‘ఆరు’ అనే నంబర్ అంటేనే.. గులాబీ దళం బెంబేలెత్తిపోతున్నదని కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది.

అంటే కేసీఆర్‌కు ఇష్టమైన లక్కీ నంబర్‌తోనే కాంగ్రెస్ కొడుతోందన్న మాట. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్ అయిన తర్వాత మరో ‘ఆరు’గురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు ఆ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే ఈ ఆరుగురు కూడా బీఆర్ఎస్ బిగ్ షాట్‌లే.. అందులోనూ పార్టీ హైదరాబాద్ సిటీకి చెందిన వారే కావడంతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి.

ఇవన్నీ ఒక ఎత్తయితే వీరంతా అప్పట్లో రేవంత్‌తో కలిసి పనిచేసినవాళ్లే.. తిరిగి ఒక గూటికి చేరిపోతున్నారు! ఆ ‘ఆరు’ అనే నంబర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మా రెడ్డి, అరికెపూడి గాంధీ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరంతా అతి త్వరలోనే బీఆర్ఎస్‌కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటారని టాక్ నడుస్తోంది. మరోవైపు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన కూడా చేసేశారు.

తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. త్వరలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా చర్చ నడుస్తున్న ఈ తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీనియర్ నేత, సిటీలో పట్టున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో.. అదే దారిలో మరికొందరు పార్టీ మారుతారన్న వార్తలు హైదరాబాద్‌లో పెద్ద చర్చనీయాంశమే అయ్యాయి.

Related posts

జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకకుండా సౌకర్యాలు

Satyam NEWS

Good News: క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Satyam NEWS

సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం

Satyam NEWS

Leave a Comment