Slider నిజామాబాద్

నాడు మద్దతు.. నేడు దూరం: కామారెడ్డి బల్దియా పీఠం హస్తగతం

#kamareddy

కామారెడ్డి బల్దియా పీఠం ఎట్టకేలకు హస్తగతమైంది. అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. గత నెలలో అవిశ్వాస తీర్మానం తర్వాత మున్సిపాలిటీలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్ కౌన్సిలర్లలో గ్రూపులు మొదలయ్యాయని ప్రచారం సాగింది. దాంతో కౌన్సిలర్లు చేజారకుండా చైర్మన్ ఎన్నిక వరకు క్యాంపుకు తరలించింది కాంగ్రెస్ పార్టీ.

నేడు మున్సిపల్ కార్యాలయానికి 29 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. ఆర్డీఓ రఘునాథ్ రావు అధ్యక్షతన నూతన చైర్ పర్సన్ కొరకు జరిగిన  మునిసిపల్ ప్రత్యేక సమావేశంలో   14వ వార్డుకు చెందిన ఇందు ప్రియ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు, ఒక ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరంకు 26 మంది సభ్యులు కావలసి ఉండగా 28 మంది కౌన్సిలర్లు  హాజరయ్యారని ఆర్డీఓ తెలిపారు.

సీల్డ్ కవర్ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్లో గడ్డం ఇందు ప్రియ పేరు రాగా 48 వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్, 38 వ వార్డు కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్లు చైర్ పర్సన్ గా ఇందుప్రియ పేరును  ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమెదించారు. కాగా 28 మంది కౌన్సిలర్లలో ఎవరైనా తటస్థంగా ఉన్నారా అని మరోమారు చేతులెత్తవలసినదిగా  కోరగా అందరు ఇందు ప్రియ  పేరును ఆమోదిస్తూ చేతులెత్తారు.

అనంతరం కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ సంతకాలు చేశారు. దాంతో గడ్డం ఇందుప్రియ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డిఓ ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. మొన్నటివరకు మున్సిపల్ చైర్మన్ గా ఉరుదొండ వనిత, గడ్డం ఇందుప్రియ పేర్లు బలంగా వినిపించాయి. ఇద్దరిలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి వస్తుందని ఎక్కువగా ఉరుదొండ వనితకే మొగ్గు చూపుతున్నట్టుగా ఎన్నిక సమయం వరకు ప్రచారం సాగింది.

నూతన ఛైర్ పర్సన్ కు శుభాకాంక్షల వెల్లువ

చైర్మన్ ఎన్నిక వరకు కూడా సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉందో తెలియదని కౌన్సిలర్లు పేర్కొనడం గమనార్హం. అయితే చైర్మన్ పదవి రాకపోవడంతో ఉరుదొండ వనిత కాస్త నిరాశగా మున్సిపల్ నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. నూతన చైర్మన్ గా ఎన్నికైన గడ్డం ఇందుప్రియకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనపై నమ్మకంతో చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం దిశగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కౌన్సిలర్ల సహకారంతో ముందుకు వెళ్తానని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాసానికి సొంత పార్టీకి చెందిన 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలిపి చైర్మన్ పీఠాన్ని కదిలించారు. అయితే అనూహ్యంగా నేడు అదే పది మంది కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాసానికి మద్దతిచ్చి ఎన్నిక సమయానికి రాకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 15 మంది కౌన్సిలర్లు ఉండగా బీజేపీకి ఆరుగురు ఉన్నారు. వీరంతా నేడు చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

సమస్యల పరిష్కారం కు సత్వర చర్యలు

Satyam NEWS

ఇక‌పై వేగ‌వంతంగా ప‌నుల‌కు బిల్లుల చెల్లింపులు…!

Bhavani

రేపు ఏరువాక పౌర్ణమి: ఏరువాక సాగారో.. నీ కష్టమంతా తీరునురో

Satyam NEWS

Leave a Comment