ఏ ప్రభుత్వం ఏర్పడినా రెండేళ్లు, మూడేళ్లకో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని మాజీ శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పరిపాలనలో ముఖ్యపాత్ర పోషించే ఉద్యోగులు సైతం బాధపడుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చకు పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. పదేళ్ళలో ఎంపీగా బిబిపాటిల్ 10 పైసల పని చదయలేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సవతి తల్లి ప్రేమ వల్ల సరిగా అభివృద్ధి పనులు చేసుకోలేకపోయామని, కేసీఆర్ వచ్చాక ఎమ్మెల్యేలకు స్వర్ణయుగం వచ్చిందన్నారు.
మొన్నటి ఓటమి ఓటమే కాదని, సాంకేతిక కారణాల వల్ల ఓటమి జరిగిందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడైన గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంటులో ఒకరు ఐదేళ్లు, మరొకరు పదేళ్ళపాటు ఎంపీలుగా చేసారని, అభివృద్ధి మాత్రం చేయలేదన్నారు. బిబిపాటిల్ బీజేపీలోకి వెళ్లారని, ఆయనకు కార్యకర్తలేవరో కూడా తెలియదన్నారు. ఒక్కసారి తనను ఎంపీగా గెలిపిస్తే మీలో ఒకరిగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి