25.7 C
Hyderabad
July 9, 2024 03: 11 AM
Slider జాతీయం

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

#modi

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కొందరు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలను విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తోందన్నారు. దశాబ్దాల తర్వాత దేశంలోని ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశాన్ని తమ ప్రభుత్వానికి కల్పించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధారణమని అయినప్పటికీ ప్రజల తీర్పును కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఓడిపోయిన వ్యక్తులు తాము గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మరోవైపు మోదీ ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపటికి ప్రధాని ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గత 10 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తున్నామని.. తమ నిరంతర సేవకు, పనికి ప్రజలు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారని ప్రధాని మోదీ రాజ్యసభలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్నికి దేశ ప్రజలు ఆశీస్సులు అందించారన్నారు. అసత్య ప్రచారాన్ని ప్రజలు ఓడించారని తెలిపారు.

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని.. ఆ రాజ్యాంగాన్ని అవమానించిన వాళ్లే ఇవాళ రాజ్యాంగాన్ని ఊపుతూ తాము పరిరక్షకులమని చెప్పుకుంటున్నారన్నారు. రాజ్యాంగం వల్లే తాను ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ఎంతో విలువైనదన్నారు. రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా పనిచేస్తుందని మోదీ తెలిపారు. రాజ్యాంగం దీపస్తంభంలా పనిచేస్తుందని చెప్పారు. నవంబరు 24న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినప్పుడు ఇక్కడ రాజ్యాంగాన్ని ఊపేస్తున్న కొందరు వ్యతిరేకించారని అన్నారు. రిమోట్ ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు అలవాటని విమర్శించారు.

కాంగ్రెస్ ఆటో మోడ్ ప్రభుత్వాన్ని కోరుకుంటోందని.. ప్రజాప్రభుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ త్వరలోనే అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధర అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Related posts

నందమూరి తారక రామారావు అంటేనే ఒక స్ఫూర్తి

Satyam NEWS

రైతును అగ్ర భాగాన నిలపడమే ముఖ్యమంత్రి లక్ష్యం

Satyam NEWS

Reseña De Casa De Apuestas Y Bonos Mostbet Peru

Bhavani

Leave a Comment