32.2 C
Hyderabad
July 2, 2024 20: 46 PM
Slider ఆదిలాబాద్

మంచి నిర్ణయాలతో అభివృద్ధి చేసే బాధ్యత అధికారులది…

ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో అధికారులకు సహకరించే బాధ్యత ప్రజాప్రతినిధులదని, మంచి నిర్ణయాలతో అభివృద్ధి చేసే బాధ్యత అధికారులదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోనేరు కృష్ణారావు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అంకిత భావంతో జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. కాగజ్ నగర్ మండలం శ్రీరాంనగర్ లోని పల్లె దవాఖాన, ఈజ్గాoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాగజ్ నగర్ పట్టణంలోని 12వ వార్డులో గల పల్లె దవాఖాన, ఎ. ఎం. సి. (కాపు వాడ) లోని మిషన్ భగీరథ అర్బన్ వాటర్ సప్లయి పథకాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రజలు కల్పించారని, అధికారంలో లేని సమయంలో సైతం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేశామని అన్నారు.

రాజకీయాలతో ప్రమేయం లేకుండా అధికార యంత్రాంగం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఇలాంటి పరిస్థితులలో వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అభివృద్ధికి సహకరించేలా సమన్వయం కలిగి ఉండాలని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అందించేందుకు ప్రణాళిక బద్ధంగా పని చేయాలని, అధికారులు ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి అందేలా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించేలా అధికార యంత్రాంగానికి స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రజలకు మేలు చేసి ఉపయోగపడే ఏ మంచి పని అయినా తాము ప్రోత్సహిస్తామని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ ఆయా జిల్లాలలో కలెక్టర్లుగా, అధికారులుగా మీపై ఉన్న నమ్మకంతో నియమించడం జరిగిందని, ఈ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించేలా విధులు నిర్వహించాలని తెలిపారని వివరించారు. అధికారుల బదిలీలలో రాజకీయ ప్రమేయం ఏ మాత్రం ఉండదని తెలిపారు. ప్రజాప్రతినిధిగా పదవి అనేది అలంకారం కాదని, బాధ్యతతో ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ కార్యవర్గం రైతుల సంక్షేమం కోసం అధికారుల సమన్వయంతో పనిచేయాలని, కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులను అరికట్టాలని, రైతులు తీసుకువచ్చిన పంట దిగుబడిని దళారీల పాలు కాకుండా సరైన మద్దతు ధర అందించి రైతు లబ్ధి పొందే విధంగా కృషి చేయాలని తెలిపారు.

కమిటీ సభ్యులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, జిల్లాలో నెలకొన్న సమస్యలపై తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోడు భూముల అంశంలో నిబంధనల ప్రకారం సాగులో ఉన్న భూములకు సంబంధించిన అంశాలను పరిశీలించడం జరుగుతుందని, అటవీ అధికారులు పోడు భూముల సమస్యపై ఆయా ప్రాంతాలలో సమీప గ్రామాల రైతులతో సమావేశాలు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా నూతనంగా పోడు సాగు చేసే వివరాలతో నివేదిక రూపొందించి, పూర్తి వివరాలతో జిల్లా కలెక్టర్ ను సంప్రదించాలని తెలిపారు. పోడు హక్కు చట్టం ప్రకారం పోడు సాగు చేస్తున్న అర్హులైన రైతులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. పోడు రైతులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయ సాగు చేస్తున్న రైతులకు భరోసా కల్పించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించి సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని, సిర్పూర్ పేపర్ మిల్లు పరిశ్రమను పునరుద్ధరించి స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారులు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యచరణ ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆటా(ATA)లో ఎన్నికల హోరు: డబ్బు పవర్ పని చేసేనా?

Bhavani

గొర్రెల కాపరి గా మల్లారెడ్డి

Bhavani

బత్తాయి పండ్లు పంచిన అక్షర ఇంటర్నేషనల్ స్కూల్

Satyam NEWS

Leave a Comment