29.2 C
Hyderabad
June 30, 2024 19: 11 PM
Slider విజయనగరం

ఆయకట్టు చివరి భూములకూ సాగునీరు అందించాలి…!

#ambedkar

ప్రస్తుత ఖరీఫ్ సీజనులో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వున్న ఆయకట్టు చివరి భూములకూ సకాలంలో సాగునీటిని అందించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని విజయనగరం జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని, ఏ ప్రాంతంలోనూ సాగునీరు అందలేదనే మాట వినిపించకుడదని చెప్పారు. ఏ ప్రాంతంలో రైతాంగానికి ఏ సమయంలో సాగునీరు అవసరమో గుర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

సాగునీటి కాల్వల నిర్వహణ, పూడికతీత వంటి అత్యవసర పనులకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు అందజేస్తే ప్రభుత్వానికి నివేదించి నిధుల మంజూరు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ డా.అంబేద్కర్ గురువారం తన చాంబరులో జలవనరుల శాఖ ఆధ్వర్యంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, ప్రస్తుత సీజనులో ఆయా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తదితర అంశాలపై ఆ శాఖ ఇంజనీర్లతో సమీక్షించారు. గత కొంత కాలంగా కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టక పోవడం వల్ల కాల్వల చివరి భూములకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చీఫ్ ఇంజనీర్ వివరించారు.

జిల్లాలోని తోటపల్లి, తాటిపూడి, ఆండ్ర వంటి సాగునీటి ప్రాజెక్టుల కాల్వల్లో పూడికతీత పనులు, నిర్వహణ పనులు చేపట్టేందుకు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పనులకు కలసి 4.30 కోట్లు అవసరం వుంటుందని జలవనరుల శాఖ ఉత్తర కోస్తా చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకర రావు, ఆయా ప్రాజెక్టుల కార్యనిర్వాహక ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ నిధులతో వెంటనే పనులు చేపట్టే అవకాశం లేనప్పటికీ పరిపాలన పరమైన అనుమతులు తీసుకొని పంటలు లేని సమయంలో పనులు పూర్తి చేస్తామని చీఫ్ ఇంజనీర్ చెప్పారు.

ఈ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించి నిధులు మంజూరు చేయిస్తామని మంజూరు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ కు సంబంధించి ఎనిమిది ప్రాజెక్టులకు గాను తోటపల్లి, తాటిపూడి, మడ్డువలస, పెద్దగెడ్డ తదితర నాలుగు ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు సరఫరా చేసేందుకు అవసరమైన నీటి నిల్వల లభ్యత వుందని మరో నాలుగు ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసిన పక్షంలో వీటిలోనూ నీటి నిల్వలు పెరిగే అవకాశం వున్నదని ఇంజనీర్ లు తెలిపారు.

ఆయా ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్ కు నీటి విడుదలకు తేదీలను కూడా నిర్ణయించామని చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ వివరించారు. జూలై ఒకటో తేదీన తాటిపూడి నుంచి, పదో తేదీన మడ్డువలస జలాశయాల నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. జిల్లాకు సంబంధించి సాగునీటి పనులకు సంబంధించి నిధుల విడుదల లేకపోవడం వల్ల పెండింగ్ లో వున్న వాటి వివరాలను అందించాలని కలెక్టర్ చీఫ్ ఇంజనీర్ కు సూచించారు.

తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో  పెండింగ్ అంశాలను చీఫ్ ఇంజనీర్ ప్రస్తావించగా భూసేకరణ అధికారులతో సమీక్షించి వాటిని కుడా త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ చెపారు.ఈసమావేశంలో తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు ఈ.ఈ. పి.అప్పలనాయుడు, రెగ్యులర్ డివిజన్ ఈ.ఈ. సీతారాం నాయుడు, మడ్డువలస ప్రాజెక్టు ఈ.ఈ. హెచ్.మన్మధ రావు, జలవనరుల విభాగం ఈ.ఈ. తిరుపతి రావు, డి.ఈ.లు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

పూజా కార్యక్రమాలతో ‘రైస్ మిల్’ మూవీ ప్రారంభం

Satyam NEWS

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెన్షన్ హర్షణీయం

Satyam NEWS

అక్రమ నిర్మాణాలకు ఆద్యం పోస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

Satyam NEWS

Leave a Comment