23.7 C
Hyderabad
June 28, 2024 05: 59 AM
Slider పశ్చిమగోదావరి

కూటమి వైపే అధిక శాతం మహిళా ఓటర్లు

#raghurama

మహిళా ఓటర్లు  కూటమి వైపే అధిక శాతం  మొగ్గు చూపారని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు తెలిపారు. దానికి హేతుబద్ధమైన కారణం  లేకపోలేదని పేర్కొన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు వైకాపాకు ఓటు వేసినప్పుడు, లబ్ధి పొందని మహిళలు  సహజంగానే వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కోటి తొమ్మిది లక్షల మంది మహిళలలో కూటమికి 79 లక్షల మంది  మహిళలు ఓటు వేయగా , వైకాపాకు 30 లక్షల మంది  వేశారన్నారు. ఈ లెక్కల ప్రకారం కోటి 69 లక్షల మందిలో  వైకాపాకు  80 లక్షల మంది  ఓటు వేయగా, కూటమికి 89 లక్షల మంది  ఓటు వేసినట్లు  స్పష్టమవుతోందని  రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇక పురుషుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో  ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన వారు 50 లక్షల మంది ఉంటే అందులో 25 లక్షల మంది వైకాపాకు, మరో 25 లక్షల మంది కూటమికి  ఓటు వేశారనుకుంటే, ఏ సంక్షేమ పథకం పొందని కోటి  14 లక్షల మందిలో  వైకాపాకు 44 లక్షల మంది, కూటమికి 70 లక్షల మంది  ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు.  

కూటమికి చాలా తక్కువగా ఓట్లు పోల్ అయినట్టు అంచనాలను వేసుకుంటే, వైకాపాకు  ఓవరాల్ గా  ఒక కోటి 49 లక్షల ఓట్లు పోల్ అయితే , కూటమికి కోటి 84 లక్షల ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ లెక్కన  వైకాపాకు, కూటమికి మధ్య 35 లక్షల ఓట్ల  వ్యత్యాసం ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో 31 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంటే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు, ఈసారి కూటమికి కూడా 151 స్థానాలకు పైగానే  వచ్చే అవకాశం లేకపోలేదన్నారు.

గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్న ఉద్యోగులు

గత ఎన్నికలతో పోలిస్తే  ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు రెట్టింపు సంఖ్యలో  ఓటింగ్ లో పాల్గొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులలో  తక్కువలో తక్కువగా  నూటికి  80 నుంచి 75 శాతం మంది కూటమికి ఓటు వేశారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూటమి వైపే  మొగ్గు చూపే అవకాశాలే అధికంగా ఉంటాయి. ఇక పోలింగ్ రోజు నాడే  బయట ఊర్ల నుంచి  ఓటు వేయడానికి వచ్చిన వారు  కచ్చితంగా ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది.

బయట ఊర్లవారిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు  ఉండే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మూడు నెలలకు ఒకసారి  వేలిముద్ర వేస్తే సరిపోతుందని నిబంధనలు ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రతి నెల వేలిముద్రవేయాల్సిందేనని షరతులు  విధించడం జరిగిందన్నారు. దీనితో,  బయటి ఊర్ల నుంచి వచ్చిన వారిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉండే అవకాశమే లేకుండా పోయింది. 

పురుషులలో నూటికి  70 శాతం మంది మద్యం సేవించే అలవాటు ఉన్నవారే ఉంటారు. వారిలో జగన్మోహన్ రెడ్డి  వీరాభిమానులు తప్ప, ప్రభుత్వం సరఫరా చేసిన నాసిరకమైన, నాణ్యత లేని   మద్యం కారణంగా అనారోగ్యం పాలై, ఆర్థిక దోపిడీకి గురైన వారంతా వైకాపాకు ఓటు వేసే అవకాశం లేదు. కూటమికి అది ఒక అదనపు పర్సంటేజ్ ఓటు బ్యాంక్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కువ చేస్తానని చెప్పారని  రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

బలంగా ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన సిక్స్ గ్యారెంటీలు 

ప్రస్తుతం క్రికెట్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ భాషలో చెప్పాలంటే   ధోని కొట్టే  సిక్సర్ల కంటే బలంగా  తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి  వెళ్ళాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి  నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం మహిళల హృదయానికి హత్తుకున్నాయనేది వాస్తవమని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

వృద్ధులను కూడా జగన్మోహన్ రెడ్డి తమ లబ్ధిదారుల జాబితాలో లెక్క కట్టుకున్నారు. వృద్ధులకు జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత 250 రూపాయలు అదనంగా  పింఛన్ ఇస్తానని చెబితే, నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే  గత మూడు నెలల పెండింగ్ పింఛన్ మొత్తాన్ని చెల్లించడం కాకుండా, ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు.

ఏ తోడు లేని వృద్ధులకు  అన్నగా, కుటుంబ పెద్దగా ఆదుకుంటానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో వృద్ధులలో కూడా 70 శాతం మంది కూటమి వైపే మొగ్గు చూపారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు దారుణంగా వంచింపబడ్డారు. అమ్మ ఒడి ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నా ఇద్దరికీ ఆర్థిక సహాయం  చేస్తామని చెప్పి  కేవలం ఒక్కరికి మాత్రమే అది కూడా రెండు వేల రూపాయల కోత విధించి, ఒక ఏడాది ఎగవేసి ఇచ్చారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత  తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలు ఉన్న  ముగ్గురు పిల్లలు ఉన్న  అందరికీ ఏడాదికి 15 వేల రూపాయలు ఎటువంటి కోతలు లేకుండా  ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందన్నారు.

గతంలో ఎంతో లబ్ధి చేసిన చంద్రబాబు నాయుడు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చారని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయినా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను విని ప్రజలు మోసపోయారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు  ఓటమికి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను ప్రజలు  విశ్వసించడమే కారణమన్నారు. ఇప్పుడు అదే ప్రజలు  జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటున్నారని, ఇది కూటమికి అన్ని విధాలుగా కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.

నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రణాళికతో సంక్షేమాన్ని చేపడుతూనే అభివృద్ధిని కొనసాగిస్తారన్నారు. అభివృద్ధిలో అందరికంటే ముందే  చంద్రబాబు నాయుడు ఉంటారని భారతీయులందరికీ, ప్రత్యేకించి ఆంధ్రులకు తెలుసునని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్లతోను, వీళ్ళతోనూ మాట్లాడి  పెద్ద పెద్ద పరిశ్రమలు  రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారనడంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించే వారి ఓట్లు కూటమికి అదనంగా ప్లస్ కానున్నాయని తెలిపారు.

Related posts

భిక్షాటన డబ్బులు తీసుకోండి.. మా భూములు ఇచ్చేయండి

Satyam NEWS

వైసిపికి భారీ షాకిచ్చినంద్యాల లాయర్ తాతిరెడ్డి తులసిరెడ్డి

Bhavani

“స్పందన” లో ఫిర్యాదులు ఎన్నొచ్చాయంటే…

Satyam NEWS