ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు. భజన బృందాలు, కోలాటాలు కేరళ డప్పు వాయిద్యాలు నడుమ పురవీధుల్లో వాహనసేవ అత్యంత వైభవంగా కనుల పండుగ జరిగింది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.