24.7 C
Hyderabad
June 23, 2024 08: 51 AM
Slider సంపాదకీయం

స్ట్రాంగ్‌రూంల భద్రతపై ప్రతిపక్షాల అనుమానాలు!

#anustrongroom

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరువాత.. పోలింగ్‌ ఎక్కువగా జరిగినప్పటికీ.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్‌ అయిన నేపథ్యంలో  ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్‌రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.

అందుకు కారణం..  తిరుపతిలో స్ట్రాంగ్‌రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటమే.  తాజాగా గుంటూరు జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లోని స్ట్రాంగ్‌రూంకు సమీపంలోనే నిఘా వర్గాల సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం  వ్యక్తం చేస్తున్నాయి.

ఏఎన్‌యూలోని డైక్‌మెన్‌ ఆడిటోరియంలో మంగళవారం నిఘా వర్గాల అధికారులు, స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎస్‌ఎస్‌జీ) సిబ్బంది సమావేశం నిర్వహించాయి. సమావేశంలో అధికారులు ప్రసంగిస్తున్న సమయంలో వారి వెనుక వైసీపీ సిద్ధం పోస్టర్‌ ప్రదర్శితమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశాయి. ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు సమీపంలో సమావేశం ఎందుకు నిర్వహించారు? ఎవరు అనుమతించారంటూ మండిపడుతున్నాయి.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ లేఖ రాశారు. సమావేశ నిర్వహణపై విచారించి, అనుమతించిన వారిపై చర్యలు తీసుకోవాలని ధూళిపాళ్ల లేఖలో కోరారు. స్ట్రాంగ్‌రూం సమీపంలో సమావేశానికి ఎవరు అనుమతించారు .. ఎందుకు అనుమతి ఇచ్చారు? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.  

డీజీపీ కార్యాలయం పక్కనే సీకే కన్వెన్షన్‌ సెంటర్‌ ఉందని.. అలాగే  ఏపీఎస్‌పీ బెటాలియన్‌లోని హాలు అందుబాటులో ఉన్నప్పటికీ .. ఏఎన్‌యూలోనే సమావేశాన్ని ఎందుకు నిర్వహించారు? అని ప్రశ్నిస్తున్నారు. పైగా అధికారులు మాట్లాడుతున్న సమయంలో సిద్ధం పోస్టర్‌ ఎందుకు ప్రదర్శితమైంది? అందుకుబాధ్యులు ఎవరు? ఈ సమావేశానికి ముందు ఇదే వేదికపై రహస్యంగా పార్టీ సమావేశం నిర్వహించారా? ఏఎన్‌యూను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నాక.. బయటి వ్యక్తుల సమావేశానికి ఎందుకు అనుమతి ఇచ్చారు?

ఇటువంటి ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. నిఘా వర్గాల సమావేశం నిర్వహణపై నరేంద్రకుమార్‌ ఫిర్యాదు నేపథ్యంలో… జిల్లా కలెక్టర్‌ , ఎస్పీ   ఏఎన్‌యూ చేరుకున్నారు. తొలుత స్ట్రాంగ్‌రూంను, తర్వాత డైక్‌మెన్‌ ఆడిటోరియంలో సీసీ ఫుటేజీని పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంలకు 200 మీటర్ల పరిధిలో బారికేడ్లు పెట్టించారు. చుట్టూ నాలుగు చెక్‌ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్‌రూం వద్ద సీఐఎస్‌ఎఫ్‌ విధులు నిర్వహిస్తోంది. అదనంగా మరో 90 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించారు. వీరికి తోడుగా మరో 100 మంది పోలీసులు విధుల్లో చేరారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related posts

శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ 28వ జన్మదినోత్సవ నాడు వేద సప్తాహం

Satyam NEWS

ప్ర‌జ‌లంద‌రూ సౌర విద్యుత్ వినియోగం వైపు మ‌ళ్లాలి

Satyam NEWS

డేంజర్:అమెరికా డాక్‌యార్డులో ఫైర్ 8 మంది మృతి

Satyam NEWS

Leave a Comment