29.7 C
Hyderabad
May 22, 2024 02: 22 AM
Slider చిత్తూరు

గోవిందా గోవింద: తిరుమల కొండపై వికటిస్తున్న కొత్త ప్రయోగాలు

#tirumala

తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఇంత రద్దీ ఎందుకు ఉంది? బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత రద్దీ తగ్గాలి. అయితే అనూహ్యంగా బ్రహ్మోత్సవాల తరువాత భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు నిండటమే కాకుండా ఐదారు కిలోమీటర్ల మేరకు క్యూలైన్లు ఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.

నారాయణగిరి విశ్రాంతి భవనంలో వెనుకభాగంలోని రింగ్‌రోడ్డు మీదుగా గోగర్భం డ్యాం వరకు సర్వదర్శన భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు క్యూలైన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలితీవ్రత కూడా అధికమైన క్రమంలో చాలామంది తిరుమల నుంచి దర్శనం చేసుకోకుండానే తిరుగు ప్రయాణమవుతున్నారు.

ఇంత దారుణమైన పరిస్థితిని భక్తులకు కల్పించింది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు అనాలోచిత నిర్ణయాలేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కాలంలో రూ.300 టిక్కెట్ దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. కేవలం విఐపి దర్శనాల పేరుతో తమకు కావాల్సిన వారిని మాత్రమే పిలుచుకుని దర్శనాలు చేయించారనే విమర్శలు ఉన్నాయి.

తమిళ భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయారా?

దాదాపు 10 రోజుల పాటు 300 రూపాయల టిక్కెట్ దర్శనాలు నిలిచిపోవడం, బ్రహ్మోత్సవాల కాలంలో సాధారణ దర్శనాలకు వచ్చే భక్తులను గంటల కొద్దీ నిలిపివేయడం తదితర కారణాలతో దాదాపు మూడు లక్షల మంది వరకూ భక్తులు తిరుమలలోనే మిగిలిపోయారు. దీనితో బాటు తమిళ భక్తులకు అత్యంత పవిత్రమైన పెరటాశి మాసం ప్రారంభం కావడంతో వారు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు.

తిరుమలలోని అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్‌, గదుల కేటాయింపు కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో 300 రూపాయల టిక్కెట్లు ఎందుకు నిలిపివేశారో ఎవరికి అర్ధం కావడం లేదు. దర్శనాలకు ఎక్కువ సమయం పడుతుంటే 300 రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసేవారు గొడవ చేస్తారు. బోర్డును నిలదీస్తారు.

గతంలో ఇలా జరిగిన కారణంగా 300 రూపాయల టిక్కెట్లను  పూర్తిగా నిలిపివేయడంతో బోర్డు నిర్ణయాలను ప్రశ్నించేవాడే లేకుండా పోయాడు. సాధారణ భక్తులు క్యూలైన్ లలో వేచి ఉంటారు తప్ప దర్శనం తమ హక్కుగా భావించరు. అందువల్ల ఎన్ని గంటల సమయం పట్టిన ఎక్కడా గొడవలు జరగలేదు. ఎక్కడా గొడవలు జరగకపోవడానికి తమ ముందు జాగ్రత్త చర్యలే కారణమని బోర్టు చైర్మన్, ఈవో ప్రకటించుకున్నారు.

సాధారణ భక్తులు నిలిచిపోయిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాల చివరి రెండు రోజులు పోలీసులకు, సిబ్బందికి కుటుంబ సమేతంగా దర్శనాలు ఏర్పాటు చేశారు. ఈ కారణంతో కూడా సాధరణ భక్తులు క్యూలైన్ లలో నిలిచిపోయారు. బ్రహ్మోత్సవాలు పూర్తి కావడంతో పోలీసులు, సిబ్బంది స్వామి వారిని దర్శనం చేసుకుని రిలాక్స్ అయి పోయారు.

భక్తులను అదుపు చేసేందుకు కానీ దర్శనాలు త్వరగా చేయించేందుకు గానీ ఎవరూ ప్రయత్నించలేదు. పాలకమండలి రిలాక్స్ కావడంతో ఈ విషయాలు పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలు బాగా చేశామని చెప్పుకోవడంలో నిమగ్నమైన పాలకమండలి బ్రహ్మోత్సవాల తర్వాత భక్తులను గాలికి వదిలేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. తిరుమల కొండపై గతంలో పని చేసిన ఐఏఎస్ అధికారులు అంతకు ముందు జరిగిన తీరును పరిశీలించి నిర్ణయాలు తీసుకునే వారు.

ఇప్పుడు తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ గతంలో జరిగిన అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతున్నదని భక్తులు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ భక్తులను ఇంతగా ఇబ్బంది పెట్టడం సబబుగా లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో అందరూ వీఐపీలే రావడంతో తిరుమల కొండపై ఉన్న దుకాణం దారులు కూడా బేరాలు లేక తీవ్రంగా నష్టపోయారు.  

Related posts

డేంజర్ పోలీస్: ప్రియాంకా గాంధీపై పోలీసుల దాడి

Satyam NEWS

తెలంగాణ పురపాలక ఎన్నికలకు జనసేన దూరం

Satyam NEWS

కరోనా ఎలర్ట్: గ్రామాలలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment