శ్రీవారి ఆలయం పై ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వెళుతున్న విమానాలను తక్షణమే నిషేధించాలని, శ్రీవారి ఆలయం పై నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆగమ శాస్త్ర సంబంధిత విషయాలే కాకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నా ఆలయ పై భాగంలో విమానాలు చక్కర్లు కొట్టడం అత్యంత ప్రమాదకరం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
తిరుమల శ్రీవారి ఆలయం పై విమాన రాకపోకలు నిషేధించేలా కేంద్ర విమానయాన సంస్థతో టీటీడీ అధికారులు సత్వరమే చర్చలు జరపాలని ఆయన కోరారు. తిరుమల శ్రీవారి ఆలయం పై మంగళవారం నాడు నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భౌగోళిక సర్వే పేరుతో ఓ చార్టెడ్ విమానంలో గంటల తరబడి చక్కర్లు కొట్టారని ఆయన అన్నారు. వివరం తెలియని భక్తుల్లో ఇది తీవ్ర ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు.
శ్రీవారి ఆలయం పైభాగంలో విమానాల నిషేధంపై టీటీడీ చైర్మన్, తిరుమల స్పెషలాఫీసర్ బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదాయ వనరులుగా టీటీడీ ఉన్నతాధికారులు చూస్తున్నారే తప్ప భద్రత గాలికి వదిలేసారని, తిరుమల ను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి నిత్యం వచ్చే స్థానిక బిజెపి నాయకులు ఆలయ పైభాగంలో విమానాలను నిషేధించేలా కేంద్ర మంత్రుల దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు.