తన చుట్టూ ఉండి భజన చేసేవారికి తప్ప చంద్రబాబునాయుడు నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వరని తెలుగు యువత అధ్యక్షుని పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీడీపీ రాష్ట్ర కార్యాలయనికి లేఖ పంపించిన దేవినేని అవినాష్ అన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులను, కార్యకర్తలను వినియోగించడంలో తెలుగుదేశం పార్టీ విఫలం అయిందని, పార్టీ లో చేరినప్పటి నుండి నిబద్ధతతో పని చేసినా గుర్తింపు రాలేదని ఆయన అన్నారు. ఎన్నికలలో నాకు అనువైన స్థానం కాకపోయినా మీ ఆదేశాలమేరకు గుడివాడ నుండి పోటీచేశాను. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసాను. కానీ ఇన్నాళ్లు నా కష్టంలో నష్టంలో అనుక్షణం నావెన్నంటి ఉన్న కార్యకర్తలకు దేవినేని నెహ్రూ అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించింది. కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదు అని ఆయన అన్నారు. అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం, పైగా భజన చేసే వారికి వత్తాసు పలకడం నా మనసును ఎంతో గాయపరిచాయి. పార్టీ మారే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్తున్నా ఎప్పటికప్పుడు నేను పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి నా గురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చెయ్యడంలో సఫలం అయినవాళ్ళని ఇంకా చంద్రబాబు చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయింది. అందుకే కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట పార్టీ వీడాలని నిర్ణయించుకున్నాను అన్నారు.