బీజేపీ వివాదాస్పద నేత, భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కు ఆగంతకులు ఒక హెచ్చరికలతో కూడిన లేఖను పంపినట్లు తెలుస్తుంది.ఆమె నివాస చిరునామాకు కొందరు ఈ లేఖను పంపించగా లేఖ ఉర్దూలో రాసి ఉండటం, దానిపై పౌడర్ రాసి ఉండటం తో అనుమానం కలిగిన ప్రజ్ఞా ఠాకూర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు.
దీంతో పోలీసులు లేఖను పరిశీలన నిమిత్తం ఫోరెన్సిక్ సిబ్బందికి పంపించారు.లేఖలో పంపించిన పత్రాల్లో ప్రజ్ఞా ఠాకూర్ సహా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ లకు కూడా హెచ్చరికలు ఉన్నాయట. వారి ఫోటోలపై కొట్టివేస్తూ x మార్క్ పెట్టడంపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. లేఖ పంపించిది ఉగ్రవాదులేనా మరెవరైనా అనే అనుమానం తో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లేఖపై ప్రజ్ఞా ఠాకూర్ స్పందిస్తూ లేఖను పంపించింది ఉగ్రవాదులేనని తెలిపారు. కానీ తాను ఉగ్రవాదుల చర్యకు భయపడబోనని తేల్చిచెప్పారు. ప్రజ్ఞా ఠాకూర్ లేఖపై పోలీసులు ఐపీసీ 326, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.