జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సాధికారత కల్పించేందుకే ఆర్టికల్ 370ని తొలగించారని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా రాజకీయ పార్టీలు జమ్మూకశ్మీర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు ప్రకటనలు చేయకపోవడమే మంచిదని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జాతీయ ఏకతా దినోత్సవం’ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
సమైక్య భారత నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి 560కుపైగా సంస్థానాలు భారత్‌లో విలీనం చేసిన నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి నేటికీ ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. నవభారత నిర్మాతగా పటేల్‌కు జాతియావత్తూ ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఐక్యత మరియు మరింత ఐక్యత’ అనే స్ఫూర్తి మంత్రాన్ని ప్రవచించి భారతదేశాన్ని ఏకం చేసే లక్ష్యాన్ని స్వయంగా స్వీకరించిన సర్దార్ పటేల్ ఆలోచనలు నేటికీ అత్యంత అనుసరణీమమన్నారు.
నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను సెప్టెంబర్ 17, 1948 న విముక్తం చేశారని.. ఇలాంటి సందర్భాలు, రాజ్యాలు ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘దేశ ప్రయోజనాల విషయంలో పటేల్ వ్యక్తిత్వం ఉక్కు కంటే కఠినమైనది. వ్యక్తిగతంగా, మానవ సంబంధాల విషయంలో పువ్వు కంటే మృదువైనది’ అని పటేల్ జీవిత చరిత్ర రాసిన రచయిత నహరి పరిఖ్ పేర్కొన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
‘సర్దార్ ఉక్కు, రేకులతో ఒక దేశాన్ని నిర్మించారు. చరిత్ర దాన్ని అనేక పేజీల్లో లిఖిస్తుంది. వారిని నవభారత నిర్మాతగా కీర్తిస్తుంది, వారి గురించి మరెన్నో గొప్ప విషయాలు చెబుతుంది’ అని ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చెప్పిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. పటేల్ తనకోసం కాకుండా మాతృభూమి కోసమే జీవిస్తారన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాటలను కూడా ఆయన గుర్తుచేశారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ ను జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి భారతీయుడు భారతదేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేసేందుకు ప్రతినబూనాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు.