31.2 C
Hyderabad
May 18, 2024 16: 30 PM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: అంతులేని కథ గా మారుతున్న లాక్ డౌన్

lockdown 161

మే 3 వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ ఇదే విధంగా కొనసాగిస్తారా? ఒకవేళ, కొనసాగింపు తప్పనిసరి అయితే,   ఎన్ని రోజులపాటు ఉంటుంది? ఈ భౌతికదూరం, ఈ సామాజిక దూరం ఇంకా ఎన్నాళ్ళు?  అనే ప్రశ్నలు కోట్ల మెదళ్లను తొలుస్తున్నాయి.

ప్రధానమంత్రి మొన్న మాట్లాడిన విధానం చూస్తుంటే, కరోనా సంపూర్ణంగా నియంత్రణలోకి వచ్చేంత వరకూ లాక్ డౌన్ కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. జూన్ నెల వరకూ ఉండవచ్చునని అంచనా వెయ్యవచ్చు.  ఇదే తీరులో కాకపోయినా, వివిధ మార్గాల్లో, వంతులవారీగా  అమలు చేయవచ్చు.

భౌతికదూరం పాటించడం, వైద్యపరమైన చర్యలు చేపట్టడంతో భారతదేశంలో జూన్ నెల మధ్యకల్లా కరోనా ఉధృతి   చాలావరకు తగ్గుముఖం పట్టే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. తగ్గుముఖం పట్టినా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకూ భౌతికదూరం, ఆరోగ్య సూత్రాలు  పాటించడం  తప్పదనే భావించాలి.

ప్రభుత్వం జూన్ కల్లా లాక్ డౌన్ ఎత్తివేసినా, సుమారు ఒకటిన్నర, రెండు సంవత్సరాలపాటు ఎవరికివారు స్వయం క్రమశిక్షణ పాటించాల్సిందేనని వైద్యులు, వైద్యశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కరోనా ఆంక్షల   అమలులో ప్రభుత్వాల  విధానాలు , ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( దబ్ల్యూ హెచ్ ఒ ) కొన్ని నియమ నిబంధనలు సూచిస్తోంది.

లాక్ డౌన్ ను సడన్ గా సడలిస్తే, వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూ హెచ్ ఒ హెచ్చరిస్తోంది. భవిష్యత్తు కోసం మానవాళి తన అలవాట్లను మార్చుకోక తప్పదని అంటోంది. మన జీవనం సాధారణస్థితికి ఎప్పుడు వస్తుందో అని మనిషి ఆరాటపడడం సాధారణమని  వ్యాఖ్యానిస్తోంది.

ఇక,  లాక్ డౌన్ విషయంలో అమలవుతున్న ఆంక్షలు  వ్యూహాత్మకంగా సాగాలని,కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న  దేశాలు మెల్ల మెల్లగా  సడలింపులు చేపట్టాలని, అదే విధంగా ప్రజలను నిదానంగా ఆర్ధికవ్యవస్థపై మళ్లించాలని, అంక్షలన్నీ ఒకేసారి ఎత్తివేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ మరియా వాన్ కెర్ ఖొవ్ అంటున్నారు.

ప్రజలు సుదీర్ఘ కాలం భౌతికదూరం పాటించడం, సబ్బు నీటితో తరచూ చేతులు కడుక్కోవడం తప్పదని చెబుతున్నారు. అలాగే, కరోనా నేపథ్యంలో ఆంక్షలను ఎలా సడలించాలి? లాక్ డౌన్ ఎలా ఎత్తివేయాలి? అనే అంశాల పట్ల అతిత్వరలో మార్గదర్శకాలను విడుదల చేస్తామని డబ్ల్యూ హెచ్ ఒ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథానోమ్ గేబ్రియేసన్ అంటున్నారు.

లాక్ డౌన్ సడలించాలనుకునే దేశాలకు ప్రాధమికంగా కొన్ని నిబంధనలు అయన సూచిస్తున్నారు. కరోనావ్యాప్తి నియంత్రణలో ఉండాలి. కేసుల్ని గుర్తించి, పరీక్షించి, ఐసోలేషన్ లోకి పంపించి, చికిత్స చేయగలిగే సామర్ధ్యం కలిగిన  వైద్యవ్యవస్థ  ఉండాలి.

బాధితుడు కలిసిన వారందరినీ గుర్తించి, పట్టుకుని, పరీక్షించ గలిగే యంత్రాంగం ఉండాలి. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ వంటి వైద్యకేంద్రాల్లో వైరస్ ఎవరికీ సోకకుండా చూసుకోవాలి. పాఠశాలలు, కార్యాలయాలు, జనసంచారం ఉండే బహిరంగ ప్రదేశాల్లో కట్టడి, నియంత్రణ చేసే వ్యవస్థ ఉండాలి.

రిస్క్ మేనేజ్ మెంట్ ఉండాలి. అన్నివర్గాలకు అవగాహన కల్పించాలి. కొత్త నిబంధనలు పాటించేలా చూడాలి. అంటూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఆరు సూత్రాలు చెబుతున్నారు.ఇప్పటికే, మన  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  “సప్తపది” పేరుతో ఏడు సూత్రాలు మనముందు ఉంచారు.

ఈ ఏడు సూత్రాలు పాటిస్తే, విజయం మనదే అంటున్నారు. (1)వృద్ధుల సంరక్షణకు చర్యలు తీసుకోండి… మామూలుగానే,ఎక్కువశాతం వృద్ధులు  అనాదరణకు గురవుతూ, వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు,పిల్లలు  ఉద్యోగపర్వంలో దూరంగా ఉండడంతో, వంటరి జీవితాలు గడుపుతున్నారు.

వారు కూడా దంపతులుగా ఉంటే కొంతమేలు. ఒంటరి అయివుంటే ఇంకా కష్టం. అటువంటి వారు ఎందరో ఉన్నారు. మరికొందరు పిల్లలతో కలిసి ఉన్నా, ఎంతవరకు తల్లిదండ్రులకు సేవలు అందిస్తున్నారన్నది ప్రశ్న. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో, వృద్ధుల సంరక్షణకు చర్యలు తీసుకోండి.. అని ప్రధాని చెప్పిన సూత్రం చాలా గొప్పది.

ఆచరణ ఊహించలేం. అది సమగ్రంగా జరిగితే చాలామంచిది. పెద్దల ఆశీస్సులు జాతికి అందుతాయి. (2) ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోండి… సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆధునికమైన మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఇప్పటికే, కోటిమంది వరకూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని సమాచారం. వృద్ధులు, నిరక్షరాస్యులు, గ్రామసీమలవారికి ఈ యాప్ పై ఇంకా  అవగాహన కల్పించడం ఎంతో అవసరం. ఈ యాప్ మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిద్దాం.

(3) పేదలకు చేయగలిగినంత సాయం చెయ్యండి…. దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, బిచ్చగాళ్ళు,  రెక్కాడితే కానీ డొక్కాడని ఆటోరిక్షా మొదలు అనేకరంగాల అభాగ్యులు, అన్నార్తులు, నిరుపేదలు ఎందరో ఉన్నారు. ఇప్పటికే,  సినిమారంగ కార్మికులకు,  వలస కూలీలకు  కొన్ని చోట్ల కొందరికి  ఆహారం అందుతోంది.

కొందరు వలసకార్మికులకు వసతి సౌకర్యం కూడా సమకూరుతోంది. ఇది మంచి పరిణామమే ఇంకా ఈ చర్యలు పెరగాల్సిన అవసరం ఉంది. “అన్ని దానాల లోకి అన్నదానం గొప్పది ” అనే సూక్తి  భారతదేశంలో ఉండనే ఉంది.అది ఎవరి పరిధిలో వారు  ఆచరణలో  పెడదాం.

(4) వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందిని గౌరవించండి…. ప్రధాని స్ఫూర్తితో, ఇప్పటికే దేశమంతా ఇక్యతా రాగం ఆలపించి,  చప్పట్లు, ఘంటానాదాలు, జ్యోతిప్రజ్వలనలతో రెండు సార్లు సంఘీభావం ప్రకటించింది. నిత్యావసర సేవలు అందించే వీరిపై,  అక్కడక్కడా దాడులు జరిగుతున్నాయి.

పంజాబ్ లో ఒక పోలీస్ చెయ్యి నరికేశారు. మన ఆంధ్రప్రదేశ్ లోని గుత్తిలో పోలీసులపై దాడులు చేశారు. తెలంగాణా రాజధాని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు జరిగాయి. దేశంలో అక్కడక్కడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కరోనా సేవల ప్రభావంతో , ఈ సేవకుల్లో   ఇప్పటికే కొందరు  కరోనా బారినపడ్డారు.అయినా లెక్కచేయకుండా, మిగిలినవారు వారి సేవలను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.

మన  జీవితాలను కాపాడే ఈ సైనికులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రధాని సూచించిన ఈ సూక్తి కూడా చాలా గొప్పది. (5) ఉద్యోగులకు అండగా నిలవండి…. ఇది చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ ఉద్యోగుల విషయం ఆలా ఉంచగా… ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇది చాలా అవసరం.

లాక్ డౌన్ సమయంలోనూ ఉద్యోగులకు సంపూర్ణంగా జీతాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ, ఆచరణలో, ఇది చాలావరకు జరుగడం లేదు. సగం జీతాలు ఇస్తామని కొందరు, ఈ నష్టాల కాలంలో అసలే ఇవ్వలేమని మరికొందరు, ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంటూ, ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతూ ఇంకొందరు ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.

లాక్ డౌన్ ప్రారంభమై పట్టుమని నెలరోజులు కాకముందే, కొన్ని యాజమాన్యాలు ఉద్యోగుల పట్ల ఇలా ప్రవర్తించి, రోడ్లమీద పడేస్తుంటే, లాక్ డౌన్ పొడిగింపుల ప్రభావం ఎటు తీసుకెళ్తుందో, అని సగటు ఉద్యోగజీవులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇటువంటి యాజమాన్యాల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. తోటి ఉద్యోగికి తోచిన సహాయం చెయ్యడం కూడా, ఈ తరుణంలో అవసరమే. అది ఆర్ధికం కావచ్చు, సేవ కావచ్చు.(6) భౌతికదూరం మరువద్దు, మాస్కులు విధిగా ధరించండి…. ఇప్పటికే ఎక్కువశాతం పాటిస్తున్నారు.

అందరూ పాటించాలి.(7) రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి… అది ఇప్పుడే కాదు. ఎప్పుడూ అవసరమే.వీటి  ఆచరణబాటలో,  సమస్యలను, సవాళ్ళను  అధిగమించి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చూపించిన సప్తపది సంపూర్ణంగా విజయమవ్వాలని ఆశిద్దాం.

చేపట్టిన లాక్ డౌన్ వ్యూహం మిగిలిన దేశాలతో పోల్చుకుంటే, కరోనా దుష్ప్రభావం ఆరోగ్య భారతంపై చాలా తక్కువగా ఉందనే భావించాలి. ఈ అంశంలో, అనేక దేశాలు  ఇప్పటికే భారత్ కు కితాబు ఇచ్చాయి. ఆర్ధికభారతం, సామాజిక భారతం మాత్రం అంత ఆరోగ్యంగా లేదు.

సమగ్ర, సంపూర్ణ  ఆరోగ్యభారత పునర్ నిర్మాణం సత్వరమే జరుగుతుందని ఆశిద్దాం.అది ఎంతో దూరం లేదని బలంగా విశ్వసిద్దాం.

మాశర్మ (సీనియర్ జర్నలిస్టు)

Related posts

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ పోస్టుల భర్తీ ప్రకటన

Satyam NEWS

బ్రిటిష్ కాలం నాటి జీఒలను తీసుకొస్తున్న జగన్ ప్రభుత్వం..!

Bhavani

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment