26.2 C
Hyderabad
May 19, 2024 21: 25 PM
Slider ముఖ్యంశాలు

నేడు కేసీఆర్ రోడ్ షో: ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు

#kcr

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు కామారెడ్డికి రానున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రోడ్ షో కామారెడ్డికి చేరుకోనుంది. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ చేపట్టిన ప్రచార యాత్ర నేడు కామారెడ్డికి రానున్న సందర్భంగా ఇప్పటికే రూట్ మ్యాప్ ను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిశీలించారు.

నిజామాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రోడ్ షో బస్సు యాత్ర జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకోనుంది. నిజాంసాగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బస్సు యాత్రకు ఘనస్వాగతం పలకనున్నారు. చౌరస్తా నుంచి రైల్వే కమాన్, పాత బస్టాండ్ ఇందిరా చౌక్, సిరిసిల్ల రోడ్డులోని ధర్మశాల, పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి జయప్రకాష్ నారాయణ్ చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది.

జయప్రకాష్ నారాయణ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగులో కేసీఆర్ ప్రసంగించనున్నారు. రోడ్ షో విజయవంతం కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే భారీ జనసమికరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సుమారు లక్ష మంది రోడ్ షోలో పాల్గొనేలా నాయకులు కసరత్తు చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు

కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ

కేసీఆర్ చేపట్టిన రోడ్ షో సందర్భంగా నిర్వహించే కార్నర్ మీటింగులో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీలో ఉన్నారు. కేసీఆర్ తో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి బరిలో నిలిచారు. మాజీ ప్రస్తుత సీఎంలపై బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కేసీఆర్ రెండవ స్థానంలో నిలవగా సీఎం రేవంత్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే గత ఎన్నికల ప్రచారంలో ఇక్కడి బీజేపీ అభ్యర్థి తనకు లెక్కే కాదని చెప్పిన కేసీఆర్ ఆయన చేతిలోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించడంతో బిబిపాటిల్ గెలుపుకోసం వెంకట రమణారెడ్డి నిరంతరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ సైతం సురేష్ షెట్కార్ గెలుపుకోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచే పెద్ద మొత్తంలో చేరికలు జరుగుతుండటంతో పాటు కామారెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం బీఆర్ఎస్ కు మైనస్ మారాయి.

బీఆర్ఎస్ నుంచి వరుసగా ఒక్కొక్క నాయకుడు కారు దిగుతున్నా ఇక్కడి నాయకులు ఆంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైర్మన్ నిట్టు జాహ్నవి పదవి గండం వెనక ముఖ్య నాయకులు ఉన్నారన్న విషయాన్ని ఆమె తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు మీడియా సమక్షంలో వెల్లడించారు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సారి నేరుగా బీఆర్ఎస్ అధినేతే కామారెడ్డికి వస్తుండటంతో ఇక్కడి రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

రాజమండ్రి కుర్రాడు “సత్య రాచకొండ”కు బలమెవ్వడు?

Satyam NEWS

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించాలి

Sub Editor 2

రెండు చోట్ల విజయనగరం పోలీస్ బాస్ జెండా ఆవిష్క‌ర‌ణ‌….!

Satyam NEWS

Leave a Comment