తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు, శబరిమల అయ్యప్ప మకరదీపం తరహాలో తిరుమణ్నామలైలోని అపితకుచలాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి కార్తీకదీప బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లోనూ ఈ పక్షం రోజులు విద్యుత్తు దీప అలంకరణ చేసి నిత్య పూజలు, అభిషేకాలతో అత్యంత శోభాయమానంగా బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు.
అరుణాచలం (అన్నామలై) తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అంటే ఎర్రని కొండ అని అర్ధం. ఇది గొప్ప పుణ్యక్షేత్రం. ఇక్కడ అరుణాచల కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని కృతికా నక్షత్రం పౌర్ణమినాడు అంగరంగ వైభవంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. సుమారుగా నవంబరు 15 నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం తమిళ క్యాలెండరు ప్రకారం నిర్వహించడం ఆనవాయితీ.
అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 28న (గురువారం) రాత్రి దుర్గాదేవి ఆలయం తిరువణ్నామలైలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో పిడారి అమ్మ ఉత్సవం ప్రారంభం అవుతుంది. శనివారం సాయంత్రం 7 గంటలకు వినాయకుడి ఉత్సవం జరుగుతుంది.
డిసెంబరు 1న ఆదివారం ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి మాఢ వీధులలో ఊరేగింపు ప్రారంభం అవుతుంది.
ప్రతిరోజూ కార్యక్రమాలతో బాటు డిసెంబరు 10న ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణీదీపం. అదేరోజు సాయంత్రం 6 గంటలకు మహాదీపం. అరుణగిరిపై దీపనాడార్ వంశస్తులు తీసుకొచ్చిన 600 మీటర్ల ఒత్తితో 2500 కేజీల ఆవునెయ్యితో అత్యంత వైభవంగా మహాదీపోత్సవం జరుగుతుంది. 13న రాత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం, 14న చండికేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది.